RGIA: శంషాబాద్‌ విమానాశ్రయంలో బాడీస్కానర్లు... త్వరలోనే ఏర్పాటు!

  • మార్చి నాటికి 84 ఎయిర్ పోర్టుల్లో బాడీ స్కానర్లు
  • త్వరలో ఆర్జీఐఏలో ప్రయోగాత్మకంగా అమలు
  • శరీర భాగాలను చూపకుండా ఎముకలను మాత్రమే చూపే లేజర్ కిరణాలు

నానాటికీ పెరుగుతున్న బంగారం అక్రమ రవాణాను అడ్డుకోవడంతో పాటు, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో బాడీ స్కానర్లు అందుబాటులోకి రానున్నాయి. 2020 మార్చి నాటికి దేశంలోని 84 విమానాశ్రయాల్లో బాడీ స్కానర్లను అమర్చాలని కేంద్రం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం విమానాశ్రయాల్లో డోర్‌ ఫ్రేమ్‌ మెటల్‌ డిటెక్టర్లు, హ్యాండ్‌ హెల్డ్‌ డివైజ్‌ ల ద్వారా, ఆపై తడిమి చూడటం (ఫ్రిస్కింగ్) ద్వారా తనిఖీలు జరుగుతున్నాయి.

కొన్ని సందర్భాల్లో నిషేధిత వస్తువుల ఆనవాళ్లు ఈ విధానంలో గుర్తించలేకపోతున్నారు. దీంతో బాడీ స్కానర్ల వ్యవస్థను అందుబాటులోకి తెస్తున్నారు. బ్యూరో ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ సెక్యూరిటీ ప్రమాణాల మేరకు త్వరలోనే ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించనున్నట్టు అధికారులు తెలిపారు. గతంలో న్యూఢిల్లీలోని ఐజీఏలో బాడీ స్కానర్లను ఏర్పాటు చేయగా, మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు ఆటంకంతో పాటు, లేజర్‌ కిరణాల నుంచి వెలువడే రేడియేషన్‌ కారణంగా ఆరోగ్యం దెబ్బతింటుందనే అభ్యంతరాలు వ్యక్తం కావడంతో వీటిని ఆపేశారు.

ఇక ఈ బాడీ స్కానర్లు మెటల్‌ డిటెక్టర్లు, సుశిక్షిత జాగిలాలు గుర్తించలేని నిషేధిత వస్తువులను సైతం పసిగడతాయి. అలాగే శరీరం లోపలి అవయవాల్లో దాచి ఉంచే బంగారం వంటి లోహాలనూ పట్టేస్తాయి. సెకన్ల వ్యవధిలోనే శరీరాన్ని స్కాన్ చేసే లేజర్‌ కిరణాలు, శరీర భాగాలను చూపించకుండా, కేవలం ఎముకలను మాత్రమే చూపుతాయి. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలగకుండా ఈ విధానంలో సోదాలుంటాయని అధికారులు అంటున్నారు.

More Telugu News