Jagan: టీటీడీ చైర్మన్ గా వైవీ సుబ్బారెడ్డి?

  • సీఎం జగన్ మరో నిర్ణయం
  • జగన్ కు బంధువుగా వైవీకి గుర్తింపు
  • విజయమ్మ చెల్లెలు స్వర్ణలతను వివాహమాడిన వైవీ

ఏపీ సీఎం వైఎస్ జగన్ మరో విధానపరమైన నిర్ణయం తీసుకున్నారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న టీటీడీ బోర్డు చైర్మన్ గా మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేరును ఖరారు చేసినట్టు విశ్వసనీయ సమాచారం. వైవీ సుబ్బారెడ్డికి జగన్ కుటుంబంతో సన్నిహిత బంధుత్వం ఉంది. సుబ్బారెడ్డి, దివంగత వైఎస్సార్ తోడల్లుళ్లు. వైఎస్ విజయమ్మ చెల్లెలు స్వర్ణలతను వైవీ వివాహమాడారు.

వైవీ సుబ్బారెడ్డి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీల్లో ఒకరు. అయితే అనూహ్యరీతిలో ఒంగోలులో మాగుంట శ్రీనివాసులురెడ్డికి సీటు ఇచ్చిన జగన్, బంధువైన వైవీని పక్కనబెట్టారు. మాగుంట ఘనవిజయం సాధించడంతో జగన్ నిర్ణయం సబబే అనిపించినా, పార్టీలో సీనియారిటీ దృష్ట్యా వైవీకి న్యాయం చేస్తే బాగుండేదన్న అభిప్రాయాలు వినిపించాయి.

ప్రస్తుతం ఆయన వైసీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. ఎన్నికల్లో ఉభయగోదావరి జిల్లాల ఇన్ చార్జిగానూ వ్యవహరించారు. కాగా, వైవీని రాజ్యసభకు పంపిస్తారంటూ కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు టీటీడీ చైర్మన్ గా ఆయన పేరు ఖరారు కావడంతో ఆ ప్రచారానికి తెరపడినట్టే భావించాలి.

More Telugu News