Germany: ఈ నర్సు రోగుల పాలిట కాలయముడు!

  • రోగులకు విషపు ఇంజెక్షన్లు
  • బతికించేందుకు ప్రయత్నం
  • సహోద్యోగుల మెప్పు పొందేందుకు దారుణాలు

నర్సు వృత్తి ఏ సమాజంలో అయినా ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అయితే జర్మనీకి చెందిన నెయిల్స్ హోజల్ మాత్రం నర్సు వృత్తికే కళంకం తెచ్చేలా వ్యవహరించాడు. అతడు చేసింది మామూలు నేరం కాదు, అతడు చంపింది ఒకర్నీ ఇద్దర్నీ కాదు, ఏకంగా 100 మంది రోగులను విషపు ఇంజెక్షన్లతో పైకి పంపించాడు. అయితే హోజెల్స్ విషపు ఇంజెక్షన్లు ఇవ్వడానికి వెనుకున్న కారణం తెలిస్తే అతడి మనస్తత్వం ఎంత దారుణమైనదో అర్థమవుతుంది.

సాధారణంగా, విషమ పరిస్థితుల్లో ఉన్న రోగులను బతికిస్తే ఆ క్రెడిట్ డాక్టర్లకు వెళుతుంది. ఒకవేళ, ఎమర్జన్సీ సమయంలో నర్సులు ఎవరైనా కాపాడితే వాళ్లను సైతం అభినందిస్తుంటారు. హోజెల్ కూడా అలాంటి గుర్తింపు తనకు మాత్రమే దక్కాలని భావించేవాడు. రోగులు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతుంటే, వాళ్లను తాను కాపాడి మంచిపేరు కొట్టేయాలన్నది అతడి ప్లాన్. అందుకోసం బెర్లిన్ లో తాను పనిచేస్తున్న ఆసుపత్రిలో కొన్ని వందల మంది రోగులకు విషపు ఇంజెక్షన్లు ఇచ్చేవాడు. వారు మృత్యువుతో పోరాడుతుంటే తాను బతికించడానికి ప్రయత్నించేవాడు. రోగి బతికితే ఇతర సిబ్బంది ముందు హీరోలా పోజులు కొట్టాలన్నది అతడి ప్రణాళిక.

కానీ, అతడు ఓ నర్సు మాత్రమే కావడంతో అతడి వైద్యపరిజ్ఞానం వాళ్లను బతికించడానికి సరిపోయేది కాదు. ఆ విధంగా ఓ 100 మంది వరకు బలయ్యాక అతడి  దారుణ కృత్యాలు వెలుగులోకి వచ్చాయి. దాంతో పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేయడంతో దిగ్భ్రాంతిగొలిపే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. హోజెల్ విషపు ఆలోచనకు బలైనవాళ్ల సంఖ్య 200 వరకు ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, తాను ఎలా వైద్యం చేస్తున్నాడో చూడాలంటూ అప్పుడప్పుడు మహిళా నర్సులకు సూచించేవాడు. ఆ విధంగా వారిలో ప్రత్యేకమైన గుర్తింపు కోసం తపించిపోయేవాడు.

More Telugu News