Rapaka: జనసేనలో ఉంటే నేనే నం.1... వైసీపీలోకి వెళితే నా నంబర్ 152: రాపాక వరప్రసాద్

  • వైసీపీలోకి వెళ్లను
  • బీజేపీ వాళ్లు ఆహ్వానించారు
  • ఈ ఒక్క సీటును వేరే పార్టీలో కలిపే ఆలోచనే లేదు

ఇటీవల ముగిసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేన దారుణంగా భంగపడిన సంగతి తెలిసిందే. ఆ పార్టీకి కేవలం ఒక్క స్థానం మాత్రం లభించింది. రాజోలు స్థానంలో రాపాక వరప్రసాద్ ఒక్కరు మాత్రమే విజయం సాధించారు. చివరికి పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రెండు చోట్ల పోటీచేసినా ఒక్కచోట కూడా గెలవలేకపోయాడు. దాంతో, జనసేన వర్గాల్లో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ కు క్రేజ్ ఏర్పడింది.

అయితే, రాపాక జనసేనలో ఎక్కువకాలం కొనసాగకపోవచ్చని, వైసీపీలోకి వెళితే ఎస్సీ సామాజిక వర్గం కోటా కింద మంత్రి పదవి గ్యారంటీ అని వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై ఆయనే స్వయంగా వివరణ ఇచ్చారు. తాను జనసేనను వీడుతున్నట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. జనసేన ప్రయాణం ఇవాళ ఒక్కడితో మొదలై రేపు వందల మందితో కొనసాగుతుందని అన్నారు.

పార్టీలోని ఏకైక సీటును మరో పార్టీలో కలిపే ప్రసక్తేలేదని అన్నారు. మున్ముందు జనసేనకు దివ్యమైన భవిష్యత్తు ఉందని, పార్టీ చీఫ్ పవన్ కల్యాణ్ ప్రజల కోసం పోరాటం చేస్తారని రాపాక తెలిపారు. కాగా, తనను బీజేపీలోకి రమ్మని ఆహ్వానించారని, కానీ తాను సున్నితంగా తిరస్కరించానని తెలిపారు. ఇటు వైసీపీలోకి కూడా వెళ్లనని, జనసేనలో ఉంటే తానే నంబర్ వన్ అని, వైసీపీలోకి వెళితే తన నంబర్ 152 అవుతుందని రాపాక చమత్కరించారు. అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151 సీట్లు వచ్చిన నేపథ్యంలో, తాను ఆ పార్టీలోకి వెళితే చిట్టచివరివాడ్నవుతానని తన వ్యాఖ్యల ద్వారా వివరించారు.

More Telugu News