West Bengal: దీదీ ప్రభుత్వం పూర్తికాలం అధికారంలో ఉంటుందనుకోవడం లేదు: బీజేపీ నేత కైలాష్‌ విజయవర్గీయ

  • 2021 వరకు మమత ప్రభుత్వం నడవడం కష్టమే
  • దానంతట అదే కూలిపోతుందనుకుంటున్నా
  • ప్రజలు సేవచేసే అవకాశం ఇచ్చినా ఆ పార్టీ నిలబెట్టుకోలేదు

పశ్చిమబెంగాల్‌లో మమతాబెనర్జీ ప్రభుత్వం 2021 వరకు పూర్తిస్థాయిలో అధికారంలో ఉంటుందని తాను అనుకోవడం లేదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కైలాష్‌ విజయవర్గీయ వ్యాఖ్యానించారు. మమత అహంకారపూరిత పాలకురాలని, ప్రజలు ఆమెకు పాలించే అధికారాన్ని వరుసగా రెండుసార్లు కట్టబెట్టినా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారని ధ్వజమెత్తారు. అందువల్ల ఆ ప్రభుత్వం దానంతట అదే కూలిపోతుందని భావిస్తున్నట్లు తెలిపారు. కాకపోతే ఇది ఎప్పుడన్నది అప్పుడే చెప్పలేమన్నారు.

‘మేము పశ్చిమబెంగాల్‌ ప్రజల మనసులు గెలవగలిగాం. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మా పార్టీ ఎంపీలు 18 మంది గెలవడం ఇందుకు సాక్ష్యం. మమతా బెనర్జీ అహంకారపూరిత ధోరణి గమనించిన ప్రజలు మావైపు చూస్తున్నారనేందుకు ఇంతకంటే నిదర్శనం ఏం కావాలి?’ అన్నారు. పశ్చిమ బెంగాల్‌లో జైశ్రీరాం అనకూడదా? అని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ఫలితాల అనంతరం మమతపై విమర్శల దాడి తీవ్రం చేసిన బీజేపీ తాజా వ్యాఖ్యలతో మరో అడుగు ముందుకు వేసింది.

More Telugu News