AP EMct: ఆంధ్రప్రదేశ్‌ ఎంసెట్‌ ఫలితాలు విడుదల... ర్యాంకర్ల వివరాలు ఇవిగో!

  • 2,82,901 మంది దరఖాస్తు
  • వీరిలో తెలంగాణకు చెందినవారు 36,698 మంది
  • ఇంజనీరింగ్‌కు దరఖాస్తు చేసినవారు 1,85,711 మంది

ఆంధ్రప్రదేశ్ ఎంసెట్‌-2019 ఫలితాలను ఉన్నత విద్యాశాఖ విడుదల చేసింది. ఈరోజు అమరావతిలోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో శాఖ ముఖ్య కార్యదర్శి దమయంతి, ఉన్నత విద్యామండలి చైర్మన్‌ విజయరాజు ఫలితాలను విడుదల చేశారు. వాస్తవానికి ఇప్పటికే ఫలితాలు విడుదల కావాల్సి ఉన్నప్పటికీ తెలంగాణ ఇంటర్‌ ఫలితాలు వివాదాస్పదం కావడం, రీ వాల్యూషన్‌ జరగడం తదితర కారణాలతో ఆలస్యమయ్యాయి. ఎంసెట్‌కు మొత్తం 2,82,901 మంది దరఖాస్తు చేయగా ఇంజనీరింగ్‌కు 1,85,711 మంది పోటీపడ్డారు. మిగిలిన వారు వ్యవసాయ, వైద్య విభాగ పరీక్షకు హాజరయ్యారు.

ఇంజనీరింగ్‌లో 1,38,160 మంది (74.39శాతం) ఉత్తీర్ణులయ్యారు. అగ్రికల్చర్ విభాగంలో 81,916 పరీక్షకు హాజరవ్వగా, 68,512 మంది (83.64శాతం) ఉత్తీర్ణులయ్యారు. కాగా, మొత్తం దరఖాస్తుదారుల్లో 36,698 మంది తెలంగాణ విద్యార్థులు ఉన్నారు. ర్యాంకు ప్రకటనలో ఇంటర్‌ మార్కులకు ప్రాధాన్యం ఉండడంతో తెలంగాణ ఫలితాల గందరగోళం వల్ల ఆలస్యమైంది. గడచిన నాలుగేళ్లలో జూన్‌లో ఫలితాలు విడుదల కావడం ఇదే మొదటిసారి. ర్యాంకుల వివరాలను విద్యార్థుల మొబైల్‌ నంబర్‌, మెయిల్‌కు పంపనున్నట్లు విజయరామరాజు తెలిపారు. ర్యాంకు కార్డులు జూన్‌ 10 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చని తెలిపారు.

 కాగా, ఇంజనీరింగ్‌లో  పి.రవిశ్రీతేజ (1), పి.వేదప్రణవ్‌ (2), జి.భానుదత్త(3), డి.చంద్రశేఖర్‌(4), ఎస్‌ఎస్‌ హేద హవ్య(4), బి.కార్తికేయ(5), రిషి షరఫ్‌ (6), జి.వెంకటకృష్ణ (7) సూర్య లిఖిత్‌ (7), అభిజిత్‌రెడ్డి (8), ఆర్యన్‌ లడ్డా (9), ఎ.హేమ వెంకట అభినవ్‌ (10) ర్యాంకులు వచ్చాయి. వ్యవసాయ, వైద్య విభాగంలో సుంకర సాయి స్వాతి (1), దాసరి కిరణ్‌కుమార్‌రెడ్డి (2), ఎ.సాయి ప్రవీణ్‌ గుప్తా (3), తిప్పరాజు హర్షిత (4), జి.మాధురిరెడ్డి (5), జి.కృష్ణ వంశి (6), కంచి జయశ్రీ(7), వైష్ణవీ వర్మ(7), బి.సుభిక్ష (8), కొర్నెపాటి హరిప్రసాద్‌ (9), ఎంపటి కుశ్వంత్‌ (10) ర్యాంకులు సాధించారు.

More Telugu News