Pakistan: ప్రపంచకప్: ఇంగ్లండ్‌ను రక్షించలేకపోయిన సెంచరీలు.. పాక్‌ చేతిలో చిత్తు!

  • 348 పరుగుల భారీ స్కోరు సాధించిన పాకిస్థాన్
  • లక్ష్య ఛేదనలో చతికిల పడిన ఇంగ్లండ్
  • ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా హఫీజ్

విండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 105 పరుగులకే కుప్పకూలి ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న పాకిస్థాన్ జూలు విదిల్చింది. సోమవారం ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో పరుగుల వరద పారించింది. ఆతిథ్య జట్టును మట్టికరిపించింది. తొలుత బ్యాటింగులోనూ, ఆ తర్వాత బౌలింగ్‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై గెలిచి తొలి విజయాన్ని నమోదు చేసింది.

ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 348 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్లు ఇమాముల్ హక్ (44), ఫఖర్ జమాన్ (36)లు తొలి వికెట్‌కు 82 పరుగులు జోడించి శుభారంభాన్ని ఇచ్చారు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన ఆటగాళ్లు కూడా జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. బాబర్ ఆజం 63, మొహమ్మద్ హఫీజ్ 84, సర్ఫరాజ్ అహ్మద్ 55 పరుగులు చేయడంతో ప్రత్యర్థి ఎదుట 349 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచగలిగింది.

అనంతరం కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇంగ్లండ్ చివరి వరకు పోరాడి చేతులెత్తేసింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 334 పరుగులు మాత్రమే చేసి విజయానికి 14 పరుగుల దూరంలో ఆగిపోయింది. జో రూట్ (107), జోస్ బట్లర్ (103) సెంచరీలతో విరుచుకుపడినా జట్టును పరాజయం నుంచి రక్షించలేకపోయారు. 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన పాక్ ఆటగాడు హఫీజ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది.

More Telugu News