Fake IPS: అయామ్‌ అభయ్‌ మీనా...ఐపీఎస్‌!: నకిలీ పోలీసు అధికారి హల్‌ చల్‌

  • ఢిల్లీ క్రైం బ్రాంచ్‌ ఏసీపీనంటూ డబ్బులు వసూలు చేస్తూ దందా
  • 12వ తరగతి తప్పినా ఐఐటీ గ్రాడ్యుయేట్‌నని బిల్డప్
  • స్ఫూర్తిదాయక ప్రసంగాలు చూసి వలలో పడిన పలువురు

జల్సాలకు డబ్బు కావాలి. ప్రేయసితో పబ్‌లు, పార్టీలకు అడ్డుండకూడదు. కానీ చేతిలో చిల్లిగవ్వలేని పరిస్థితి. ఏం చేయాలి? ఇలా ఆలోచిస్తున్న ఆ యువకుడికి ఓ ఐడియా మెరుపులా మెరిసింది. దీంతో 20 ఏళ్లకే నకిలీ పోలీసు అధికారి అవతారం ఎత్తాడు. 'అయామ్‌ అభయ్‌ మీనా...ఐపీఎస్‌' అంటూ కేసులున్న వారిని, తప్పుడు పనులు చేసే వ్యక్తులను బెదిరించి పబ్బం గడుపుకోవడం మొదలు పెట్టాడు. చివరికి గుట్టురట్టవ్వడంతో కటకటాలపాలయ్యాడు.

వివరాల్లోకి వెళితే...అభయ్‌ మీనా అనే 20 ఏళ్ల యువకుడు ఇంటర్‌ తప్పాడు. కానీ ఐఐటీ పూర్తి చేశానని, యూపీపీఎస్సీ పరీక్షలో తొలి ప్రయత్నంలోనే ఐపీఎస్‌ సాధించానని చెప్పడం మొదలు పెట్టాడు. మొదటి ప్రయత్నంలోనే పోలీసు అధికారి కావాలన్న పట్టుదలతో అత్యధిక సమయం చదివేవాడినంటూ నమ్మబలికాడు. సామాజిక మాధ్యమాల్లో పోస్టయిన మీనా ప్రసంగాలు కాలక్రమంలో ప్రాచుర్యం పొందడంతో ఎందరో యువకుకులకు ఇతను స్ఫూర్తిప్రదాతగా మారిపోయాడు. అతని మాయలో నిజమైన పోలీసు అధికారులు సైతం పడ్డారు. కొన్ని సందర్భాల్లో అతనికి శాల్యూట్‌ చేసిన అధికారులున్నారు.

ఓ వైపు ఇలా తన ప్రసంగాలతో ఆకట్టుకుంటునే, మరోవైపు అధికార దర్పాన్ని ప్రదర్శిస్తూ అభయ్‌మీనా మోసాలకు తెరలేపాడు. తన కారుకు డీజీ లేదా అదనపు డీజీ హోదా ఉన్న అధికారులు వాడే మూడు నక్షత్రాలు కలిగిన ఫలకాన్ని పెట్టుకునేవాడు. తాను ఢిల్లీ కేడర్‌ ఐపీఎస్‌ అధికారినని, అక్కడి క్రైం బ్రాంచ్‌లో ఏసీపీగా పనిచేస్తున్నానని చెప్పుకుని తిరిగేవాడు. న్యాయపరమైన కేసుల్లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న వారిని లక్ష్యంగా చేసుకుని బెదిరించి, సాయం చేస్తానని చెప్పి డబ్బు వసూలు చేసేవాడు.

ఒ యువతితో సహజీనం చేస్తుండడంతో ఆమెతో కలిసి ఖరీదైన హోటళ్లలో విందు, వినోదాలు చేసేవాడు. ఐపీఎస్‌ ఆఫీసర్ అని చెప్పుకుంటూ బెదిరించి బిల్లులు కూడా చెల్లించే వాడు కాదు. అభయ్‌ మీనా దందా నిరాటంకంగా సాగిపోతున్న దశలో ఓ పోలీసు అధికారికి అతనిపై అనుమానం వచ్చింది. అతని గుర్తింపు కార్డులో క్రైం బ్రాంచ్‌, కేపిటల్‌ అనే ఆంగ్ల పదాల్లో అక్షర దోషాలు ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు. ఆ అధికారి ఇచ్చిన సమాచారం మేరకు ప్రత్యేక పోలీసులు జగత్‌పురలోని అతడి అపార్ట్‌మెంట్‌పై దాడిచేసి గుట్టురట్టు చేశారు.

తొలుత తనిఖీలకు వచ్చిన అధికారులను కూడా బెదిరించాలని చూసిన అభయ్‌ మీనా అది సాధ్యం కాదని తేలిపోవడంతో నిజం అంగీకరించి లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఓ పోలీసు అధికారి మాట్లాడుతూ ‘అతను తిరిగే కారుపై పెట్టుకున్న మూడు నక్షత్రాల ప్లేట్‌ సీనియర్‌ ఐపీఎస్‌ అధికారులకు మాత్రమే ఉంటుంది. అప్పుడే సర్వీసులోకి వచ్చిన అధికారికి ఆ ప్లేట్‌ ఎలా వచ్చిందన్న ఆలోచన  ట్రాఫిక్‌ పోలీసులకు కలగలేదంటే నమ్మలేకపోతున్నాను. ఆ వాహనాన్ని ఎప్పుడూ తనిఖీ చేయకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది' అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

More Telugu News