Maruti Jyotishyalayam: బ్లాక్ మెయిల్ చేస్తున్నారంటూ... పోలీసులను ఆశ్రయించిన సన్నిధానం లక్ష్మీకాంత్ శర్మ!

  • అసత్య వార్తలను ప్రసారం చేసి పరువు నష్టం
  • రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు
  • శర్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు

మీడియా ముసుగేసుకున్న కొందరు రూ. 50 లక్షలు ఇవ్వాలంటూ తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని మారుతీ జ్యోతిష్యాలయం, సేవా సమితి నిర్వాహకుడు సన్నిధానం లక్ష్మీకాంత్‌ శర్మ పోలీసులను ఆశ్రయించారు. శర్మ ఇచ్చిన ఫిర్యాదులోని వివరాల ప్రకారం, మే 15న మారుతీ సేవా సమితి కార్యాలయానికి వెళ్లిన ఓ వ్యక్తి, తాను రిపోర్టర్ నని, శర్మను కలవాలని వచ్చానని అన్నాడు.

ఆ సమయంలో శర్మ లైవ్‌ లో ఉన్నారని ఉద్యోగి చెప్పగా, దుర్భాషలాడుతూ, మీ గురూజీ పెద్ద మోసగాడని, విలేకరులను గౌరవించడం లేదని వెంటనే ఆయనతో ఫోన్‌ చేయించాలని బెదిరించి వెళ్లాడు. జరిగిన ఘటనను తెలుసుకున్న శర్మ, సదరు వ్యక్తికి ఫోన్ చేయలేదు. ఆపై మూడు రోజుల తరువాత, తన కెమెరామన్‌ తో కలిసి అక్కడికి వెళ్లిన ఆ రిపోర్టర్ ఎవరి అనుమతీ లేకుండా వీడియో తీశాడు.

మరో ఇద్దరు టీవీ చానల్ ప్రతినిధులను కలుపుకుని, రూ. 50 లక్షలు డిమాండ్ చేశారు. డబ్బు ఇవ్వకుంటే, తప్పుడు వార్తలు ప్రసారం చేస్తామని బెదిరింపులకు దిగారు. వారి డిమాండ్ ను తాను పట్టించుకోకపోవడంతో, 21వ తేదీన మారుతీ సేవా కేంద్రంపై యూట్యూబ్‌ ద్వారా వారి చానెళ్లలో అసత్య వార్తలను ప్రసారం చేశారు. దీంతో తన పరువుకు భంగం కలిగిందని, వారిపై చర్యలు తీసుకోవాలని లక్ష్మీకాంత్‌ శర్మ, చిలకలగూడ పోలీసులను ఆశ్రయించగా, కేసు నమోదు చేసిన పోలీసులు విచారిస్తున్నట్టు తెలిపారు.

More Telugu News