mahatma Gandhi: గాంధీని హత్య చేసిన గాడ్సేకు కృతజ్ఞతలు చెప్పి, చిక్కుల్లో పడిన ఐఏఎస్ అధికారిణి!

  • గాడ్సేను కీర్తిస్తున్న నేతలు, అధికారులు
  • మొన్న సాధ్వి ప్రజ్ఞ, నిన్న ఉషా ఠాకూర్.. నేడు ఐఏఎస్ అధికారిణి
  • మండిపడుతున్న కాంగ్రెస్

మహాత్మాగాంధీని కాల్చి చంపిన నాథూరామ్ గాడ్సేకు కృతజ్ఞతలు చెప్పిన ఐఏఎస్ అధికారిణి, బృహన్ ముంబై మునిసిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నిధి చౌదరి చిక్కుల్లో పడ్డారు. గాడ్సేకు కృతజ్ఞతలు అంటూ ఆమె చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపడంతో వెంటనే స్పందించిన నిధి ఆ ట్వీట్‌ను డిలీట్ చేసి నష్ట నివారణ చర్యలు చేపట్టారు. తానేదో వ్యంగ్యంగా ట్వీట్ చేశానని, దానిని అందరూ తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు.

నిధి చౌదరి ట్వీట్‌పై కాంగ్రెస్ తీవ్రంగా స్పందించింది. ఆమెపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. గాడ్సేను ప్రశంసించి గాంధీని అవమానించడం బీజేపీ నేతలకు అలవాటైందని, ఇటీవల బీజేపీ ఎంపీ సాధ్వి ప్రజ్ఞాసింగ్ ఠాకూర్, ఉషా ఠాకూర్‌లు ఆ పనిచేశారని, ఇప్పుడు నిధి వారికి జత కలిశారని సూర్జేవాలా మండిపడ్డారు. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ వెంటనే ఆమెపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. గాంధీని అవమానించేలా ట్వీట్ చేసిన నిధిని ఉపేక్షించవద్దని, చర్యలు తీసుకోవాల్సిందేనని ఎన్సీపీ డిమాండ్ చేసింది.

More Telugu News