India: పాక్ లో భారత్ ఇఫ్తార్ విందు... అతిథులను వేధించిన పాకిస్థాన్ సెక్యూరిటీ!

  • ఇస్లామాబాద్ లోని హోటల్ లో విందు
  • భద్రత పేరిట అతిథులకు వేధింపులు
  • క్షమాపణ చెప్పిన భారత రాయబారి

ఇస్లామాబాద్ లో భారత విదేశాంగ శాఖ తరఫున దౌత్యాధికారులు ఇఫ్తార్ విందును ఇచ్చిన వేళ, అక్కడ సెక్యూరిటీ విధుల్లో ఉన్న సిబ్బంది అతిథులను వేధించారు. తాము ఆహ్వానించిన వారికి ఎంతో మానసిక క్షోభ కలిగిందని వారికి క్షమాపణలు చెబుతున్నామని పాక్ లో భారత హై కమిషనర్ అజయ్ బిసారియా వెల్లడించారు.

కాగా, ఇప్తార్ విందుకు హాజరైన అతిథులతో అక్కడి సెక్యూరిటీ సిబ్బంది అమర్యాదగా వ్యవహరించారు. ఇస్లామాబాద్‌ లోని సెరెనా హోటల్ లో ఈ కార్యక్రమం జరుగగా, దీనికి పలువురు అతిథులు హాజరయ్యారు. భద్రతా కారణాల పేరు చెబుతూ, అతిథులకు తీవ్ర అసహనం కలిగించడంతో పాటు సిబ్బంది ఓ అతిథిని కొట్టారని తెలుస్తోంది. గెస్ట్‌ ల కార్లను పార్కింగ్‌ స్థలం నుంచి తొలగించడంతో పాటు పలువురి వాహనాలను హోటల్ లోనికి అనుమతించక పోవడంతో కొందరు ముఖ్యులు సైతం విందుకు రాకుండా వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలంటూ భారత్ ఒత్తిడి తెస్తున్న నేపథ్యంలోనే పాకిస్తాన్ భద్రతా ఏజెన్సీలు తమలోని అసంతృప్తిని ఇలా వెళ్లగక్కుతున్నాయని భారత్ విమర్శించింది.

More Telugu News