YV Subba Reddy: వైవీ సుబ్బారెడ్డికి టీటీడీ చైర్మన్ పదవి దక్కే చాన్స్!

  • వైవీ స్థానాన్ని మాగుంటకు ఇచ్చిన జగన్
  • సంతృప్తి పరిచేందుకు టీటీడీ చైర్మన్ పదవి ఆఫర్!
  • ఇంకా అభిప్రాయం చెప్పని వైవీ

ఒంగోలు మాజీ ఎంపీ, గడచిన ఎన్నికల్లో వైసీపీ నుంచి టికెట్ ను దక్కించుకోలేకపోయిన కీలక నేత వైవీ సుబ్బారెడ్డికి తొలి దశలోనే గౌరవమైన పదవిని ఇవ్వాలని భావిస్తున్న ఏపీ సీఎం జగన్, ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా నియమించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దివంగత వైఎస్‌ సతీమణి విజయమ్మ, వైవీ సుబ్బారెడ్డి సతీమణి సొంత అక్కా చెల్లెళ్లన్న సంగతి తెలిసిందే. ఆపై వైవీ సోదరిని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి వివాహం చేసుకున్నారు. దీంతో వైవీ కుటుంబం వైఎస్ కుటుంబం సమీప బంధువులుగా మారారు.

ఇక జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ను ప్రారంభించినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి కీలకంగా ఉంటూ వచ్చారు. తన స్థానంలో మాగుంట శ్రీనివాసులరెడ్డికి ఒంగోలు లోక్ సభ సీటు ఇచ్చినా, ఆయన సహకరించారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల తరువాత, అమరావతి సచివాలయంలో జగన్ చాంబర్ మార్పు చేర్పుల పనులను వైవీ దగ్గరుండి చూసుకున్నారు. రాష్ట్రస్థాయిలో జగన్‌ కార్యాలయ వ్యవహారాలను ఆయన పరిశీలిస్తున్నారు.

ఇదిలావుండగా, ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి మంత్రి పదవి ఇస్తానని జగన్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనకు మంత్రి పదవి ఖాయమని తెలుస్తుండగా, వైవీని సంతృప్తిపరిచేందుకు కూడా జగన్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆయన్ను రాజ్యసభ సభ్యుడిగా పంపుతారని కొందరు అంటుండగా, టీటీడీ చైర్మన్ పదవిని ఇస్తారని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

కాగా, ప్రస్తుత టీటీడీ ఛైర్మన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌, తాను స్వచ్ఛందంగా రాజీనామా చేసే పరిస్థితే లేదని, కావాలంటే ప్రభుత్వమే బోర్డును రద్దు చేయవచ్చని భీష్మించుకు కూర్చున్న నేపథ్యంలో పాలక మండలిని రద్దు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో టీటీడీ పాలకమండలిని రద్దు చేస్తూ ఉత్తర్వులు వెలువడవచ్చని, ఆపై కొత్త చైర్మన్ ను జగన్ ప్రకటిస్తారని సమాచారం. తనకు చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తే, దాన్ని స్వీకరించాలా? వద్దా అన్న విషయంలో తన అభిప్రాయం ఏంటన్నది వైవీ సుబ్బారెడ్డి ఇంకా వెల్లడించక పోవడం గమనార్హం.

More Telugu News