kishan reddy: ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డా అన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. ఒవైసీ అభ్యంతరం!

  • దేశంలో ఎక్కడ ఉగ్రదాడి జరిగినా మూలాలు హైదరాబాద్‌లోనేనన్న కిషన్ రెడ్డి
  • ఇస్లాం పేరుతో రెచ్చగొట్టి రక్తపాతం సృష్టిస్తున్నారని ఆవేదన
  • ఒవైసీ-కిషన్ రెడ్డి మధ్య మాటల యుద్ధం

ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందంటూ కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదం అవుతున్నాయి. కేంద్రమంత్రిగా శనివారం బాధ్యతలు స్వీకరించిన అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఉగ్రదాడులు జరిగినా వాటి మూలాలు హైదరాబాద్‌లో లభించడం దురదృష్టకరమని అన్నారు. ఉగ్రవాదులకు హైదరాబాద్ సేఫ్ సిటీగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదానికి మతంలేదని, కొందరు ఇస్లాం పేరుతో రెచ్చగొట్టి రక్తపాతం సృష్టిస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శించారు.  

ఉగ్రవాదులకు హైదరాబాద్ అడ్డాగా మారిందన్న కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఓ టీవీ చానల్ వేదికగా ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. ముస్లింలు అంటే బీజేపీకి విపరీతమైన ద్వేషమని అసద్ అన్నారు. ఉగ్రవాద సంస్థ ఐసిస్‌కు చెందిన సభ్యులు ఉత్తరప్రదేశ్‌లోనే అత్యధికంగా పట్టుబడ్డారని, మరి ఉగ్రవాదులకు యూపీ అడ్డా అని చెప్పగలరా? అని ప్రశ్నించారు. కాగా, తాను చేసిన వ్యాఖ్యలకు పూర్తిగా కట్టుబడి ఉన్నానని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఉగ్రవాద వ్యాఖ్యలపై అమిత్ షా తనకు తలంటినట్టు వచ్చిన వార్తలు పూర్తిగా అవాస్తవమని మంత్రి స్పష్టం చేశారు.

More Telugu News