Warangal Urban District: బైక్‌తో సహా బావిలో పడిన వ్యక్తి.. 30 గంటల అనంతరం ప్రాణాలతో బయటపడిన వైనం!

  • వరంగల్ అర్బన్ జిల్లాలోని నాగారంలో ఘటన
  • వాహనం ఢీకొనడంతో బైక్‌తో సహా 75 అడుగుల లోతైన బావిలోకి..
  • నిద్రాహారాలు లేకుండా 30 గంటలు నీటిలోనే బాధితుడు

‘ఈ భూమ్మీద ఇంకా నూకలున్నాయి’ అని ఇందుకే అంటారు కాబోలు. బైక్‌తో సహా బావిలో పడిన ఓ వ్యక్తి 30 గంటల తర్వాత ప్రాణాలతో బయటకు వచ్చాడు. గొంతు చించుకున్నా రక్షించే నాథుడు కనిపించని వేళ.. గుండె ధైర్యమే ఆసరాగా బావిలోని పైపును పట్టుకుని రోజంతా గడిపేశాడు. చివరికి ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడయ్యాడు. వరంగ్ అర్బన్ జిల్లాలోని హసన్‌పర్తి మండలం నాగారం శివారులో జరిగిందీ ఘటన.
 
జమ్మికుంటకు చెందిన వజ్ర రాజమొగిలి (60) గురువారం హన్మకొండలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. శుక్రవారం తెల్లవారుజామున 3:30 గంటల ప్రాంతంలో తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. నాలుగు గంటల సమయంలో నాగారం క్రాస్ సమీపంలో వెనక నుంచి వచ్చిన ఓ వాహనం రాజమొగిలి బైక్‌ను ఢీకొట్టింది. ఏ జరిగిందో తెలుసుకునే లోపే 75 అడుగుల లోతున్న బావిలో బైక్‌తో సహా రాజమొగిలి పడిపోయాడు. ఈత రావడంతో ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేశాడు. తలకు ఉన్న హెల్మెట్ తీసి తనను రక్షించాలంటూ గట్టిగా కేకలు వేశాడు. ఫలితం లేకుండా పోయింది. దీంతో బావిలోని పైపును పట్టుకుని అలాగే 30 గంటలపాటు గడిపాడు.

శనివారం ఉదయం తన పొలానికి వచ్చిన సమ్మిరెడ్డి అనే రైతు బావిలోంచి అరుపులు రావడం విన్నాడు. వెంటనే  వెళ్లి చూడగా అందులో పైపును పట్టుకున్న రాజమొగిలి కనిపించాడు. దీంతో అతడికి ధైర్యం చెప్పిన సమ్మిరెడ్డి వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పాడు. అందరూ కలిసి తాళ్లు తీసుకుని బావి వద్దకు వచ్చారు. తాళ్లను బావిలోకి వేసి రాజమొగిలిని రక్షించారు. విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులకు చేరవేయడంతో వారొచ్చి గ్రామస్థులకు కృతజ్ఞతలు చెప్పి రాజమొగిలిని ఇంటికి తీసుకెళ్లారు.

More Telugu News