ముందు మీరు... కాదు మీరు... జగన్, కేసీఆర్ మధ్య ఆసక్తికర సన్నివేశం!

02-06-2019 Sun 07:13
  • ఇఫ్తార్ విందు ఇచ్చిన గవర్నర్
  • హాజరైన తెలుగు రాష్ట్రాల సీఎంలు జగన్, కేసీఆర్
  • గవర్నర్ పక్కన ఎవరు కూర్చోవాలన్న సందిగ్ధత
  • జగన్ చేయి పట్టి తీసుకెళ్లి కూర్చోబెట్టిన కేసీఆర్

పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ప్రముఖులు ఇఫ్తార్ విందును ఇస్తుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇదే సందర్భంలో తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్, హైదరాబాద్ లోని రాజ్‌ భవన్‌ లో శనివారం నాడు విందును ఏర్పాటు చేసిన వేళ, ఓ ఆసక్తికర ఘటన జరిగింది. ఈ విందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్, కేసీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ తో పాటు కేసీఆర్, జగన్ ఆశీనులయ్యే వేళ, గవర్నర్ పక్కన ఎవరు కూర్చోవాలన్న విషయంలో కేసీఆర్, జగన్ మధ్య కొంత సందిగ్ధత నెలకొంది. నరసింహన్ పక్కనే ఉన్న కుర్చీలో మీరు కూర్చోండంటే... మీరు కూర్చోండంటూ వీరిద్దరూ ఒకరికి ఒకరు చెప్పుకున్నారు. ఆపై వైఎస్ జగన్‌ ను చేయి పట్టుకుని మరీ గవర్నర్ వద్దకు తీసుకెళ్లిన కేసీఆర్, ఆయన పక్కనే కూర్చోబెట్టారు.