Australia: ఆప్ఘనిస్థాన్‌పై ఆసీస్ ఘన విజయం

  • 207 పరుగులకే ఆఫ్ఘనిస్థాన్ ఆలౌట్
  • మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించిన ఆసీస్
  • ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌గా డేవిడ్ వార్నర్

ప్రపంచకప్‌లో భాగంగా శనివారం రాత్రి బ్రిస్టల్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్థాన్ 38.2 ఓవర్లలో 207 పరుగులకు ఆలౌట్ అయింది. ఆఫ్ఘాన్ బ్యాట్స్‌మెన్‌లలో రహ్‌మత్ షా 43, కెప్టెన్ గుల్బాదిన్ నైబ్ 31, నజీబుల్లా జద్రాన్ 51, రషీద్ ఖాన్ 27 పరుగులు చేశారు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ కాగా, మిగతా వారెవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఆసీస్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆడం జంపా చెరో మూడు వికెట్లు తీసుకోగా, మార్కస్ స్టోయినిస్ రెండు, మిచెల్ స్టార్క్ ఒక వికెట్ పడగొట్టారు.

అనంతరం 209 పరుగుల స్వల్ప విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా 34.5 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 209 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు అరోన్ ఫించ్ (66), డేవిడ్ వార్నర్ 89 (నాటౌట్) అర్ధ సెంచరీలతో జట్టుకు విజయాన్ని అందించారు. ఉస్మాన్ ఖావాజా 15, స్టీవెన్ స్మిత్ 18 పరుగులు చేశారు. ఆఫ్ఘాన్ బౌలర్లలో ముజీబుర్ రెహ్మాన్, గుల్బాదిన్ నైబ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీసుకున్నారు. డేవిడ్ వార్నర్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది. కాగా, నేడు దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య లండన్‌లో మ్యాచ్ జరగనుంది.

More Telugu News