USA: నకిలీ యువరాజు గారి గుట్టురట్టు చేసిన పందిమాంసం!

  • అమెరికాలో నకిలీ సౌదీ యువరాజు
  • 30 ఏళ్లుగా దొరకని వైనం
  • అదే పనిగా పందిమాంసం తింటుండడంతో అనుమానాలు

అమెరికాలో ఓ వ్యక్తి తాను సౌదీ యువరాజునంటూ ఏకంగా 30 ఏళ్లపాటు అందరినీ నమ్మించిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఫ్లోరిడాకు చెందిన 48 ఏళ్ల ఆంటోనీ జిగ్నాక్ మయామీ ఫిషర్ ఐలాండ్ లో నివసిస్తుంటాడు. అయితే, సులభంగా డబ్బు సంపాదించడానికి అలవాటుపడిన జిగ్నాక్ మూడు దశాబ్దాల క్రితం ఎవరూ ఊహించని ఎత్తుగడ వేశాడు. తనను తాను సౌదీ యువరాజు ఖలీద్ బిన్ అల్ సౌద్ గా ప్రచారం చేసుకున్నాడు. అతని చుట్టూ చేతిలో కాగితాలతో పెద్దసంఖ్యలో బాడీగార్డులు కనిపిస్తుండడంతో ప్రజలు కూడా నమ్మేశారు. నిత్యం ఎంతో ఖరీదైన ఫెరారీలో తిరిగేవాడీ నకిలీ యువరాజు.

తాను వ్యాపార అభివృద్ది కోసం అమెరికా వచ్చానని, తనతో వ్యాపారం చేయాలనుకునేవాళ్లు పెట్టుబడి పెట్టొచ్చంటూ ఆఫర్ ఇచ్చాడు. దాంతో అనేకమంది అతడి మాయలో పడిపోయారు. ఆ విధంగా రూ.55 కోట్లు వసూలు చేశాడు. ఆ డబ్బుతో ప్రయివేట్ జెట్ విమానాల్లో విహారాలు, ఖరీదైన బోట్లతో రేసింగ్ లు, డిజైనర్ డ్రెస్సులతో వైభోగం వెలగబెట్టాడు. ఈ తంతు 30 ఏళ్లపాటు నిరాటంకంగా సాగింది కానీ, జిగ్నాక్ తిండిపోతుతనం అతడి గుట్టురట్టు చేసింది.

తాను వేసింది అరబ్ యువరాజు వేషం.. కానీ తినేది పందిమాంసం! అరబ్బులు పందిమాంసం అంటే ఎంతో విముఖత ప్రదర్శిస్తారు. వారి మతంలోనే పందిమాంసం పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది. జిగ్నాక్ అదేపనిగా పందిమాంసం లాగిస్తుండడాన్ని ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి గమనించాడు. ఆరా తీయగా అసలు విషయం బయటపడింది. చివరికి నకిలీ యువరాజుకు అరదండాలు పడ్డాయి. 2017లో అతడ్ని అరెస్ట్ చేయగా, విచారణ అనంతరం అతడు చేసిన మోసాలకు గాను 18 ఏళ్ల జైలుశిక్ష విధించారు.

USA

More Telugu News