Andhra Pradesh: కేసీఆర్ యువతకు ఉద్యోగాలివ్వడం మానేశారు.. రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలిస్తున్నారు!: లక్ష్మణ్

  • విద్యార్థులు లేరని స్కూళ్లు మూసేస్తున్నారు
  • కేవలం 20 వేల ఉద్యోగాలే ఇచ్చారన్న జీవన్ రెడ్డి
  • టీఆర్టీ అభ్యర్థులకు కాంగ్రెస్, బీజేపీ నేతల సంఘీభావం

విద్యార్థులు లేరని సాకులు చూపుతూ తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలు మూసేస్తోందని బీజేపీ రాష్ట్ర చీఫ్ లక్ష్మణ్ విమర్శించారు. ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమయిందని దుయ్యబట్టారు. చదువుకున్న యువతకు ఉద్యోగాలు ఇవ్వడం మానేసి రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఉద్యోగాలు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. టీఆర్టీకి ఎంపికైన అభ్యర్థులు హైదరాబాద్ లోని ధర్నాచౌక్ వద్ద నిర్వహిస్తున్న రిలే దీక్షకు లక్ష్మణ్, కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా జీవన్ రెడ్డి స్పందిస్తూ.. తెలంగాణ ఉద్యమాన్ని యువతే ముందుండి నడిపించిందని గుర్తుచేశారు. ‘ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 1.20 లక్షల ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఎన్నికల్లో చెప్పినట్లు ఇప్పటివరకూ 2.20 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి. కానీ కేవలం 20,000 ఉద్యోగాలు భర్తీ చేసి చేతులు దులుపుకున్నారు. దీంతో నిరుద్యోగ యువత ఉద్యమబాట పడుతోంది. ఇందుకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి’ అని స్పష్టం చేశారు.

More Telugu News