modi: మోదీ ప్రభుత్వాన్ని రాహుల్ సమర్థవంతంగా ఎదుర్కొన్నారు.. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాలి: సోనియాగాంధీ

  • ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందవద్దు
  • పార్టీకి పునర్వైభవం తీసుకొద్దాం
  • రాహుల్ రాత్రింబవళ్లు కష్టపడ్డారు

ఎన్నికల ఫలితాలతో నిరాశ చెందకూడదని... ఓటమి నుంచి పాఠాలను నేర్చుకోవాలని యూపీఏ ఛైర్ పర్సన్ సోనియాగాంధీ అన్నారు. తీవ్ర సంక్షోభాల్లోనే అపూర్వ అవకాశాలు ఉంటాయని చెప్పారు. మన ముందున్న సవాళ్లను అధిగమించి, పార్టీకి పునర్వైభవాన్ని తీసుకొద్దామని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఈరోజు సోనియాగాంధీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు.

పార్టీ అధినేతగా రాహుల్ గాంధీ రాత్రింబవళ్లు కష్టపడ్డారని... మోదీ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా ఎదుర్కొన్నారని సోనియా అన్నారు. అనేక రాష్ట్రాల్లో పార్టీకి పునరుజ్జీవం పోశారని చెప్పారు. యువత, మహిళలు, నిరుద్యోగులు, వ్యాపారులు, కార్మికులు, రైతుల సమస్యలను ఎత్తిచూపారని తెలిపారు. వాటి ఫలితంగానే మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్ లలో కాంగ్రెస్ అధికారంలోకి రాగలిగిందని అన్నారు.

More Telugu News