Andhra Pradesh: పోలీసు శాఖ తమకోసమే ఉందని ప్రజలు అనుకునేలా చేస్తాం: గౌతమ్ సవాంగ్

  • రాష్ట్ర పోలీస్ బాస్ గా బాధ్యతలు చేపట్టిన సవాంగ్
  • డీజీపీ ఆఫీసుకు భార్యాబిడ్డలతో కలిసి వచ్చిన వైనం
  • సవాంగ్ కు శుభాకాంక్షల వెల్లువ

ఏపీ సీఎంగా జగన్ ప్రమాణస్వీకారం చేసిన తర్వాత ఉన్నతస్థాయిలో కొత్త అధికారులను తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి గౌతమ్ సవాంగ్ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో ఆయన అధికారికంగా విధినిర్వహణలో అడుగుపెట్టారు. ఈ సందర్భంగా సవాంగ్ మాట్లాడుతూ, పోలీసు శాఖ తమకోసమే ఉందని ప్రజలు అనుకునేలా చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్యేకంగా మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులను అరికట్టేందుకు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ, శాంతిభద్రతలు తమ ప్రాధాన్యత అంశాల్లో భాగమని చెప్పారు.

ముఖ్యంగా, సామాన్యుడికి ఎప్పుడూ పోలీసు శాఖ అందుబాటులో ఉండేవిధంగా విధివిధానాలు ఉంటాయని సవాంగ్ వెల్లడించారు. కాగా, డీజీపీ బాధ్యతలు స్వీకరించేందుకు సవాంగ్ తన భార్యాబిడ్డలతో కలిసి వచ్చారు. ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్నట్టు సంతకం పెట్టగానే కుమార్తె వచ్చి ఆనందంతో తండ్రిని హత్తుకున్నారు. భార్య కూడా పక్కన వచ్చి నిలబడి సంతోషంతో చిరునవ్వులు చిందించారు. ఏపీ పోలీస్ బాస్ గా విధుల్లో అడుగుపెట్టిన ఈ సీనియర్ ఐపీఎస్ అధికారికి అభినందనలు వెల్లువెత్తాయి. పోలీసు ఉన్నతాధికారులు ఆయనకు పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.

More Telugu News