jagan: సీఎం జగన్ పై గంటా శ్రీనివాసరావు విమర్శలు

  • నవరత్నాల హామీ నుంచి తప్పించుకుంటున్నారు
  • పెన్షన్ ను రూ. 3వేలకు పెంచుతామన్న హామీని తుంగలో తొక్కారు
  • మధ్యపాన నిషేధంపై మాట తప్పారు

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్వీకరించిన జగన్ ను అభినందించేందుకు రెండు రోజుల పాటు ప్రయత్నించినా... కలిసే అవకాశం లభించలేదని టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు తెలిపారు. జగన్ ను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు తనతో పాటు పయ్యావుల కేశవ్, అచ్చెన్నాయుడును పార్టీ హైకమాండ్ నియమించిందని చెప్పారు. ఇదే సందర్భంలో జగన్ పై గంటా విమర్శలు గుప్పించారు. ప్రమాణస్వీకారం సమయంలో జగన్ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన నవరత్నాల హామీ నుంచి తప్పించుకునేందుకు జగన్ యత్నిస్తున్నారని విమర్శించారు.

ప్రధాని మోదీని కలిసిన తర్వాత ప్రత్యేక హోదాపై జగన్ స్పష్టంగా మాట్లాడలేకపోతున్నారని... డొంకతిరుగుడుగా మాట్లాడుతున్నారని గంటా అన్నారు. టెండర్లను రద్దు చేస్తామంటూ, గత ప్రభుత్వంపై కక్ష సాధింపులకు దిగేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. పెన్షన్ ను రూ. 3వేలకు పెంచుతామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని... రూ. 250 మాత్రమే పెంచి, రూ. 2,250కి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు. మద్య నిషేధంపై కూడా మాట తప్పారని దుయ్యబట్టారు. గెలుపు, ఓటములు టీడీపీకి కొత్త కాదని... తిరిగి ప్రజల మద్దతును పొందుతామని తెలిపారు.

More Telugu News