Southwest Monsoon: రైతులకు తీపి కబురు.. ఈ ఏడాది కరవుతీరా వర్షాలు

  • జూన్-సెప్టెంబరు మధ్య 96 శాతం వర్షపాతం
  • రెండో నివేదికను విడుదల చేసిన వాతావరణ శాఖ
  • 6న కేరళను తాకనున్న రుతుపవనాలు

ఈ ఏడాది కరవుతీరా వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్-సెప్టెంబరు మధ్య సగటు వర్షపాతంలో 96 శాతం నమోదవుతుందంటూ రైతులకు తీపి కబురు చెప్పింది. ఈ సీజన్‌లో సాధారణ వర్షపాతమే నమోదవుతుందంటూ ఏప్రిల్ 15న ఇచ్చిన తొలి అంచనా నివేదికలో మరింత సమాచారం జోడించిన వాతావరణ శాఖ శుక్రవారం రెండో దశ నివేదికను విడుదల చేసింది. చివరి రెండు నెలలకు సంబంధించిన తుది నివేదికను జూలై చివరిలో ఇవ్వనున్నట్టు తెలిపింది.  

పసిఫిక్ మహాసముద్రంలో ప్రస్తుతం బలహీనమైన ఎల్‌నినో పరిస్థితులు నెలకొన్నాయని, నైరుతి ముగిసే వరకు ఇవే పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని అంచనా వేసింది. దీంతో ఖరీఫ్‌కు ఎంతో కీలకమైన జూలై, ఆగస్టు నెలల్లో వరుసగా 95 శాతం, 99 శాతం వర్షపాతం నమోదవుతుందని పేర్కొంది.

గత నెల 18న అండమాన్‌ సముద్రంలోకి ప్రవేశించిన రుతుపవనాలు 25నాటికి మాల్దీవులు, కొమరన్‌ తీరం వరకు విస్తరించాయి. ఆ తరువాత 4 రోజుల వరకు స్థిరంగా ఉన్న రుతుపవనాలు మే 30న  అండమాన్‌లోని అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ, నైరుతి, తూర్పు మధ్య బంగాళాఖాతంలో పలు ప్రాంతాలకు విస్తరించాయి. ఫలితంగా  జూన్‌ 6 నాటికి కేరళను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

More Telugu News