Mamatha Benerji: దీదీ కాన్వాయ్‌ను అడ్డుకుని, నినాదాలు చేసిన బీజేపీ కార్యకర్తలు.. కన్నెర్రజేసిన మమత!

  • మా కాన్వాయ్‌ వెళ్తుండగా కొందరు అడ్డగించారు
  • వారు బయటి నుంచి వచ్చిన వారు
  • హిందీ మాట్లాడే వారితో ఎలాంటి వైరం లేదు
  • 2021లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు

తృణమూల్‌ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కాన్వాయ్‌కి బీజేపీ కార్యకర్తలు అడ్డుపడి, 'జై శ్రీరాం' అంటూ నినాదాలు చేస్తూ ఆమెను రెచ్చగొట్టే ప్రయత్నం చేయడంతో ఆమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇటీవల ఎన్నికల ప్రచారం నేపథ్యంలో వివిధ ప్రాంతాల్లో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలు నేడు ధర్నాకు తలపెట్టాయి. ఈ ధర్నాలో పాల్గొనేందుకు మమత వెళుతుండగా మార్గమధ్యంలో బీజేపీకి చెందిన వారిగా భావిస్తున్న కార్యకర్తలు ఆమె కాన్వాయ్‌ని అడ్డగించారు. మరోసారి ఇలాంటి చేష్టలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని మమత హెచ్చరించినా కూడా కార్యకర్తలు వెనక్కి తగ్గలేదు. వెంటనే వారిని అదుపులోకి తీసుకోవాలని మమత పోలీసులను ఆదేశించారు.

 ‘‘మా కాన్వాయ్‌ వెళ్తుండగా.. బీజేపీ రిబ్బన్లను నుదుటికి ధరించిన కొంతమంది వ్యక్తులు అడ్డుపడ్డారు. వారు స్థానికులు కాదు, బయటి నుంచి వచ్చిన వారు. హిందీ మాట్లాడే ప్రజలతో నాకు ఎలాంటి వైరం లేదు. కానీ బెంగాల్‌ ప్రాంతానికి చెందని కొందరు రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులో ఉన్న సందర్భంలోనూ వారు ఇలాంటి హింసాత్మక ఘటనలకే ఒడిగట్టారు. రాష్ట్ర వనరులను వినియోగించుకుంటూనే నన్ను వ్యతిరేకించే సాహసం చేస్తున్నారు.  స్థానికులకు, బెంగాలీయేతరులకు మధ్య కొంతమంది చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. 2021లో బీజేపీ ఒక్క సీటు కూడా గెలవదు’’ అని మమత పేర్కొన్నారు.

More Telugu News