England: ప్రపంచకప్: ఇంగ్లండ్ చేతిలో చిత్తుగా ఓడిన సఫారీలు

  • ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఘన విజయం
  • పది ఓవర్ల ముందే చేతులెత్తేసిన దక్షిణాఫ్రికా
  • ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో నలుగురు అర్ధ సెంచరీలు

ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. లండన్‌లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ఇంగ్లండ్ 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 311 పరుగుల భారీ స్కోరు చేసింది.

ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్‌లలో నలుగురు అర్ధ సెంచరీలు సాధించారు. జాసన్ రాయ్ 54, జో రూట్ 51, కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 57 పరుగులు చేయగా, బెన్ స్టోక్స్ 89 పరుగులు చేశాడు. చివర్లో ఇంగ్లిష్ బ్యాట్స్‌మెన్‌ను సఫారీ బౌలర్లు కట్టడి చేయడంతో ఇంగ్లండ్ స్కోరు 311 పరుగుల వద్ద ఆగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో లుంగి ఎంగిడి 3 వికెట్లు తీసుకోగా, ఇమ్రాన్ తాహిర్, కగిసో రబడ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. పెహ్లుక్వాయోకు ఓ వికెట్ దక్కింది.

అనంతరం 312 పరుగుల భారీ విజయ లక్ష్యంలో బ్యాటింగ్ ప్రారంభించిన సౌతాఫ్రికా 39.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటై ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (68), డుసెన్ (50) మాత్రమే అర్ధ సెంచరీలు చేశారు.  మిగతా వారిలో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఇంగ్లిష్ బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ చేతులెత్తేశారు. దీంతో ఆరంభ మ్యాచ్‌లో ఘోర పరాజయాన్ని అందుకుంది.

ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా అర్చర్ 3 వికెట్లు తీసుకోగా, ప్లంకెట్, బెన్ స్టోక్స్ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. అదిల్ రషీద్, మొయిన్ అలీలకు చెరో వికెట్ దక్కింది. అటు బ్యాటింగ్‌లోను, ఇటు బౌలింగ్‌లోను రాణించిన బెన్ స్టోక్స్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు’ దక్కింది.

More Telugu News