New Delhi: పదిహేడవ లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా సంతోష్‌ గంగ్వార్‌?

  • ప్రస్తుత సభలో ఆయనే అత్యంత సీనియర్‌
  • మేనకా గాంధీ కూడా ఇదే సీనియర్‌
  • ఆమె మంత్రివర్గంలో చేరే అవకాశం ఉండడంతో సంతోష్‌కే చాన్స్‌

పదిహేడవ లోక్‌సభ కొలువు దీరిన తర్వాత ప్రొటెం స్పీకర్‌గా సభలో అత్యంత సీనియర్‌ సభ్యుడైన సంతోష్‌ గంగ్వార్‌ను నియమించే అవకాశం ఉంది. ఉత్తరప్రదేశ్‌లోని బరేలి నియోజకవర్గం నుంచి గంగ్వార్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇదే సభలో సభ్యురాలైన మేనకాగాంధీ కూడా ఇదే సీనియారిటీ కలిగి ఉన్నప్పటికీ ఆమె మంత్రివర్గంలో చేరే అవకాశం ఉండడంతో సంతోష్‌ గంగ్వార్‌కే అవకాశం ఉంది.

 ఎనిమిదిసార్లు లోక్‌సభకు ఎన్నికైన గంగ్వార్‌ నియామకం దాదాపు ఖరారైనట్టేనని భావిస్తున్నారు. ఒకవేళ మేనకగాంధీతోపాటు గంగ్వార్‌కు కూడా మంత్రివర్గంలో చోటు లభిస్తే ఆ తర్వాత సీనియర్‌  అయిన కేరళ కాంగ్రెస్‌ ఎంపీ కొడికున్నిల్‌ సురేష్‌కు అవకాశం దక్కవచ్చు. గత లోక్‌సభలో కమల్‌నాథ్‌ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు.

అనంతరం కొత్త స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కాగా, గంగ్వార్‌ను స్పీకర్‌గా ఎన్నుకునే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం. ఒకవేళ అది జరిగినా ప్రొటెం స్పీకర్‌గా మరొకరికి అవకాశం ఉంటుంది. కాగా స్పీకర్‌గా గంగ్వార్‌తోపాటు ప్రహ్లాద్‌ జోషి, ప్రహ్లాద్‌ పటేల్  పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

More Telugu News