Mamata Banarjee: అయాం సారీ నరేంద్ర మోదీ గారూ... ఈ కారణంగానే మీ ప్రమాణస్వీకారానికి రాలేకపోతున్నా: మమత

  • రాజకీయ ప్రయోజనాల కోసం విలువలు తగ్గించొద్దు
  • బెంగాల్ మృతులపై మీడియాలో వస్తున్నవి తప్పుడు కథనాలు
  • బెంగాల్ లో జరిగినవి రాజకీయ హత్యలు కాదు

బెంగాల్ లో 54 మంది రాజకీయ ఘర్షణల్లో మృతిచెందారని, వారందరూ బీజేపీ కార్యకర్తలేనని మీడియాలో వస్తున్న కథనాలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ లో ఇటీవల మృతి చెందినవారి కుటుంబాలకు మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి ఆహ్వానాలు పంపినట్టు తెలియడంతో జాతీయ మీడియా దాన్ని విశేషంగా ప్రసారం చేస్తూ, ఆ మృతులందరూ రాజకీయపరమైన కారణాలతోనే చనిపోయినట్టు బీజేపీ నేతలను ఉటంకిస్తూ ప్రముఖంగా పేర్కొంది. దీనిపై మమతా బెనర్జీ తీవ్రంగా స్పందించారు.

తమ రాష్ట్రంలో రాజకీయ ఘర్షణల్లో ఎవరూ చనిపోలేదని, వ్యక్తిగత కక్షలు, కుటుంబ సమస్యలు, తగాదాల కారణంగానే చనిపోయారని, జాతీయ మీడియాలో వస్తున్న కథనాల్లో నిజంలేదని స్పష్టం చేశారు. ఇలాంటి దిగజారుడు రాజకీయాలతో ప్రజాస్వామ్యం విలువ తగ్గించవద్దంటూ ఆమె బీజేపీకి హితవు పలికారు. ప్రమాణస్వీకారం అనేది ప్రజాస్వామ్యంలో ఓ సంబరం వంటిదని, దాన్ని కించపర్చవద్దంటూ సూచించారు. అందుకే తాను మోదీ ప్రమాణస్వీకారోత్సవానికి హాజరుకాబోవడంలేదని తేల్చిచెప్పారు.

ఓ సీఎంగా ప్రధాని ప్రమాణస్వీకారానికి వెళ్లడం రాజ్యాంగ విధుల్లో భాగమే అయినా, తాజా పరిణామాలు చూస్తూ కూడా ప్రమాణస్వీకారోత్సవానికి వెళ్లలేనని అన్నారు. "అయాం సారీ నరేంద్ర మోదీ గారూ, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రమాణస్వీకారోత్సవం వంటి గొప్ప కార్యక్రమం విలువను తగ్గించే ప్రయత్నాలు వద్దు" అంటూ దీదీ ఓ లేఖ రాశారు.

More Telugu News