కవిత కోసం రాజీనామా చేస్తా: టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్

29-05-2019 Wed 14:25
  • జగిత్యాల నుంచి ఎమ్మెల్యేగా కవిత పోటీ  చేయాలి
  • ఆమెను మేము గెలిపించుకుంటాం
  • హుజూర్ నగర్ నుంచి ఆమె పోటీ చేయరు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె కవిత కోసం రాజీనామా చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానని జగిత్యాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల నుంచి కవితను ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యేగా కవిత పోటీ చేయాలనుకుంటే జగిత్యాల నుంచే పోటీ చేయాలని అన్నారు. కవిత పోటీ చేసే విషయంలో హైకమాండ్ దే తుది నిర్ణయమని చెప్పారు. హుజూర్ నగర్ నుంచి కవిత పోటీ చేయబోరని తెలిపారు.

పార్లమెంటు ఎన్నికల్లో నిజామాబాద్ స్థానం నుంచి కవిత ఓటమిపాలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఆమె ఎమ్మెల్యేగా పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. హుజూర్ నగర్ ఎమ్మెల్యే, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ సారి ఎంపీగా గెలుపొందిన సంగతి తెలిసిందే. దీంతో, హుజూర్ నగర్ స్థానానికి జరగబోయే ఉపఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థిగా కవిత పోటీ చేస్తారనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి.