Rayalaseema: కరవు నేలలో వజ్రాల వేట... పొలాల బాటలో వేలాది మంది!

  • కరవు తాండవించే అనంతపురం
  • కురిసిన తొలకరితో బీడు భూముల్లో వజ్రాల కోసం వెతుకులాట
  • పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలు

రాయలసీమలోని అనంతపురం జిల్లాలో కరవు ఎలా తాండవిస్తుంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఎండ మంటలు, నీటి కొరతతో అల్లాడుతుండే జిల్లాలో, వజ్రకరూర్ మండలానికి మాత్రం ఓ ప్రత్యేకత ఉంది. ప్రతియేటా తొలకరి జల్లులు పడగానే, వివిధ ప్రాంతాలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి వేలాది మంది తరలివస్తారు.

ఇక్కడి బీడు భూముల్లో వజ్రాల కోసం వెతుకులాడతారు. వాటికోసం పొలాల్లోని మట్టిని తూర్పారపడుతుంటారు. చిన్న రంగురాయి కనిపిస్తే, దాని క్వాలిటీ ఎంతో తెలుసుకునేందుకు ఉరుకులు పరుగులు పెతతారు. ఈ ప్రాంతంలో వర్షాలు పడితే, భూమిలోపలి వజ్రాలు పైకి వస్తాయన్న నమ్మకంతో ఉండే స్థానికులతో పాటు ఎంతో మంది ఈ సంవత్సరం కూడా మండలంలో వజ్రాల కోసం వెతుకుతున్నారు.

ప్రతి సంవత్సరమూ 10 నుంచి 20 వరకూ నాణ్యమైన వజ్రాలు ఇక్కడ లభిస్తాయని చెబుతుండే స్థానికులు, ఆదివారం భారీ వర్షం కురవడంతో, అప్పటి నుంచి వజ్రాల వేటలో నిమగ్నమయ్యారు. కాగా, వజ్రాలు లభిస్తాయన్న కారణంతోనే ఈ ప్రాంతంలో వజ్రకరూర్ అనే మండలం ఏర్పడింది. 

More Telugu News