jagan: మారిన జగన్ షెడ్యూల్... తొలుత తిరుమలకు, ఆపై ఇడుపులపాయకు!

  • నేటి సాయంత్రం నేరుగా తిరుమలకు
  • రేపు స్వామి దర్శనానంతరమే కడపకు
  • తండ్రికి నివాళుల అనంతరం తిరిగి తాడేపల్లికి జగన్

నవ్యాంధ్ర కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేటి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా ఇడుపులపాయకు వెళ్లి, తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులు అర్పించి, ఆపై తిరుపతికి వెళ్లాల్సిన జగన్, తొలుత తిరుపతికి వెళ్లి, ఆపై రేపు కడప జిల్లాకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ ఉదయం కడపకు బయలుదేరాల్సిన ఆయన, తన కార్యక్రమాన్ని మార్చుకున్నారు. సాయంత్రం వరకూ తాడేపల్లిలోనే అధికారులతో సమావేశాలు, సమీక్షలు జరిపి, ఆపై తిరుపతికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు.

మారిన షెడ్యూల్ ప్రకారం, నేటి సాయంత్రం 5 గంటలకు తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకునే జగన్, ప్రత్యేక విమానంలో రేణిగుంట వెళ్తారు. అక్కడి నుంచి నేరుగా తిరుమలకు చేరుకుంటారు. రాత్రి ఏడు గంటలకు తిరుమలకు చేరుకునే జగన్ రాత్రికి అక్కడే బస చేస్తారు. రేపు ఉదయం స్వామివారిని దర్శించుకుంటారు.

ఆపై తిరిగి రేణిగుంటకు వచ్చి, ప్రత్యేక విమానంలో కడపకు వస్తారు. కడప పెద్ద దర్గాలో ప్రార్థనల అనంతరం పులివెందులకు వెళ్లి సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థనలు చేస్తారు. ఆ తరువాత ఇడుపులపాయకు వెళ్లి తన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పిస్తారు. ఆపై మళ్లీ కడపకు వచ్చి ప్రత్యేక విమానంలో గన్నవరం చేరుకుని, తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.

కాగా, ఈ ఉదయం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డితో సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, డీజీపీ ఆర్పీ ఠాకూర్‌ లు సమావేశం అయ్యారు. 30న జరగనున్న ప్రమాణస్వీకారోత్సవానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి జగన్‌ కు వీరు వివరించారు. ఆపై రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి గోపాలకృష్ణ ద్వివేది కూడా జగన్‌ ను కలిశారు. పలు శాఖల కార్యదర్శులు జగన్ ను కలిసి ప్రస్తుత పరిస్థితులు, చేపట్టాల్సిన మార్పులపై సలహాలు ఇచ్చారు.

More Telugu News