TTD: టీటీడీ పాలకమండలి సమావేశం రసాభాస... వెళ్లిపోయిన ఈఓ సింఘాల్... రాజీనామా చేసిన తెల్లాబాబు!

  • నైతికంగా తప్పుకుంటున్నట్టు చెప్పిన తెల్లాబాబు
  • సమావేశంలో విమర్శలు, ప్రతివిమర్శలు
  • సమావేశం వివరాలను అడిగి తెలుసుకున్న సీఎస్

ఈ ఉదయం టీటీడీ పాలకమండలి సమావేశం అన్నమయ్య భవన్ లో ప్రారంభమైన కొద్దిసేపటికే రసాభాసగా మారింది. సమావేశం అదుపుతప్పిన వేళ, ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓలు మధ్యలోనే బయటకు వెళ్లిపోయారు. బోర్డు సభ్యుడు తెల్లాబాబు, తన పదవికి రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. ప్రభుత్వం మారిన నేపథ్యంలో బోర్డు సభ్యులంతా తప్పుకోవడం నైతికతని ఆయన చేసిన వ్యాఖ్యలు సమావేశంలో వేడిని రగిల్చాయి. టీటీడీ ఉద్యోగులు బోర్డుకు ఎంతమాత్రమూ సహకరించలేదని కొందరు చేసిన వ్యాఖ్యలు కూడా వివాదానికి కారణమయ్యాయి.

బోర్డు నిబంధనల మేరకు తాము సమావేశం అవుతున్నామని చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. కొత్త ప్రభుత్వం ఏర్పడనున్న వేళ, ఇలా సమావేశాలు నిర్వహించడం సరికాదని, ఈఓ వెంటనే బోర్డును రద్దు చేయాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. బోర్డు సభ్యులంతా నామినేటెడ్ పదవులను అనుభవిస్తున్న టీడీపీ నేతలని, వారంతా తప్పుకోవాల్సిందేనని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాగా, నేటి పాలకమండలి సమావేశం జరిగిన తీరును ఏపీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అడిగి తెలుసుకున్నారు. 

More Telugu News