Tibetan spiritual leader: సిక్కిం ముఖ్యమంత్రికి దలైలామా అభినందనలు.. ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందంటూ లేఖ

  • అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయాన్ని అందుకున్న తమాంగ్ 
  • 25 ఏళ్ల పవన్ చామ్లింగ్ పాలనకు చరమగీతం
  • తొలి పర్యటన అనుభవాలను గుర్తు చేసుకున్న దలైలామా

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేం సింగ్ తమాంగ్‌ను టిబెటన్ల ఆధ్యాత్మిక గురువు దలైలామా అభినందించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమాంగ్ పార్టీ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ విజయంతో మీపై ఉన్న బాధ్యత మరింత పెరిగిందని, మీ సారథ్యంలో రాష్ట్ర మరింత ముందుకెళ్తుందని ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో దలైలామా పేర్కొన్నారు. మీ పాలనలో ప్రజలు మరింత అభివృద్ధి చెందుతారని ఆశిస్తున్నట్టు దలైలామా పేర్కొన్నారు.

తాను సిక్కింను సందర్శించిన ప్రతిసారీ ప్రజలు ఎంతో ఆప్యాయతను పంచారని, గుర్తుండిపోయే ఆతిథ్యాన్ని ఇచ్చారని ఈ సందర్భంగా లామా గుర్తు చేసుకున్నారు.  1956లో తాను సిక్కింను తొలిసారి సందర్శించినప్పటి జ్ఞాపకాలు ఇంకా అలాగే పదిలంగా ఉన్నాయని లామా పేర్కొన్నారు.

సిక్కిం అసెంబ్లీకి ఇటీవల జరిగిన ఎన్నికల్లో తమాంగ్ సారథ్యంలోని సిక్కిం క్రాంతికారీ మోర్చా మెజారిటీ సీట్లను కైవసం చేసుకుంది. దీంతో 25 ఏళ్ల పవన్ చామ్లింగ్ పాలనకు ఫుల్‌స్టాప్ పడింది. కాగా, దలైలామా ఆదివారం అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌లను కూడా అభినందించారు.

More Telugu News