Andhra Pradesh: అమరావతిలో పూర్తయిన చంద్రబాబు చిత్రాల తొలగింపు... మంత్రుల పేషీలన్నీ జీఏడీ అధీనంలోకి!

  • పేషీల్లో పనిచేసిన ఉద్యోగులు సొంత శాఖలకు
  • నేమ్ ప్లేట్లూ, ఫోటోలను తొలగించిన అధికారులు
  • తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులు ముగిసినట్టే
  • కొత్త మంత్రులకు రెండు రోజుల్లో పేషీలు

అమరావతి సచివాలయంలోని అందరు మాజీ మంత్రుల చాంబర్లూ సాధారణ పరిపాలనా విభాగం (జీఏడీ) అధీనంలోకి వెళ్లిపోయాయి. రాష్ట్రంలో ప్రభుత్వం మారనున్న నేపథ్యంలో కొత్తగా రానున్న మంత్రులకు సౌలభ్యంగా, సౌకర్యవంతంగా ఉండేలా పేషీలను తీర్చిదిద్దాలన్న ఆదేశాల మేరకు అధికారులు పనిచేస్తున్నారు.

ఇప్పటికే అన్ని బ్లాక్ లలో ఉన్న చంద్రబాబు చిత్ర పటాలను, మాజీ మంత్రుల నేమ్ ప్లేట్లనూ జీఏడీ సిబ్బంది తొలగించారు. వాటి స్థానంలో కొత్తగా వచ్చేవారి పేర్లతో నేమ్ ప్లేట్లు రాయిస్తామని స్పష్టం చేశారు. ఇక ఇప్పటివరకూ మంత్రుల పేషీల్లో పనిచేస్తున్న సిబ్బందిని వారి సొంత శాఖల అధిపతుల వద్ద రిపోర్ట్ చేయాలన్న ఆదేశాలు కూడా వెలువడ్డాయి. మంత్రుల వద్ద పనిచేసిన తాత్కాలిక ఉద్యోగుల కాంట్రాక్టులు ముగిసినట్టేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు. కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరుగగానే, రెండు రోజుల్లోనే పేషీలను సిద్ధం చేసి వాటిని అప్పగించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు వెల్లడించారు.

More Telugu News