Guntur: గల్లా జయదేవ్ గెలుపును కోర్టులో సవాల్ చేస్తా: మోదుగుల వేణుగోపాల్ రెడ్డి

  • 9,500 పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించలేదు
  • నా ఓటమికి అధికారుల తప్పిదమే కారణం
  • ఈ అంశంపై జగన్ తో చర్చించా

గుంటూరు ఎంపీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డిపై టీడీపీ నేత గల్లా జయదేవ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే, తన ఓటమితో మనస్తాపం చెందిన మోదుగుల సంచలన వ్యాఖ్యలు చేశారు. గల్లా జయదేవ్ గెలుపును కోర్టులో సవాల్ చేస్తానని అన్నారు. 9,700 కు పైగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కించలేదని ఆరోపించారు. తన ఓటమికి అధికారుల తప్పిదమే కారణమని అన్నారు.

ఈ లెక్కించని ఓట్లలో గల్లాకో లేదా తనకో ఓట్లు ఉండవచ్చని, ఆ ఓట్లను లెక్కించని అధికారులు ప్రాథమిక హక్కును కాలరాశారని మండిపడ్డారు. నైతికంగా చూస్తే గల్లా జయదేవ్ గెలిచినట్టు కాదని వ్యాఖ్యానించారు. ఈ విషయంపై వైఎస్ జగన్, విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డితో కూలంకషంగా చర్చించినట్టు చెప్పారు. మధ్యంతర ఉత్తర్వుల కోసం హైకోర్టును ఆశ్రయిస్తామని, బహు:శ ఎల్లుండి కోర్టులో పిటిషన్ వేస్తామని అన్నారు. కాగా, మోదుగులపై 4800 ఓట్ల ఆధిక్యంతో గల్లా జయదేవ్ విజయం సాధించారు.

More Telugu News