Visakhapatnam District: విశాఖలో కిడ్నీ రాకెట్ కేసు.. శ్రద్ధ ఆసుపత్రి ఎండీ అరెస్టు

  • ఈ కేసులో ఏ6 నిందితుడు శ్రద్ధ ఆసుపత్రి ఎండీ ప్రదీప్
  • ప్రదీప్ ని ఈరోజు కోర్టులో హాజరుపర్చిన పోలీసులు
  • వచ్చే నెల 4 వరకు రిమాండ్ విధింపు

విశాఖపట్టణంలో ఇటీవల సంచలనం సృష్టించిన కిడ్నీ రాకెట్ కేసులో శ్రద్ధ ఆసుపత్రి ఎండీ డాక్టర్ ప్రదీప్ ని పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ఏ6 నిందితుడిగా ఉన్న ప్రదీప్ ని ఈరోజు కోర్టులో హాజరుపర్చారు. వచ్చే నెల 4 వ తేదీ వరకు రిమాండ్ విధిస్తున్నట్టు న్యాయమూర్తి తెలిపారు. కాగా, కేసులో ఇప్పటివరకూ నలుగురిని అరెస్టు చేశారు. శ్రద్ధా ఆసుపత్రిని అధికారులు ఇప్పటికే సీజ్ చేశారు.

కాగా, హైదరాబాద్ కు చెందిన పార్ధసారథి అనే వ్యక్తి తన ఆర్థిక పరిస్థితి బాగుండకపోవడంతో అప్పు కోసం విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో బెంగళూరుకు చెందిన ప్రభాకర్ తో ఆయనకు పరిచయమైంది. కిడ్నీ అమ్మితే రూ.12 లక్షలు ఇస్తారని ప్రభాకర్ చెప్పిన మాటలకు పార్ధసారథి ఆకర్షితుడయ్యాడు. ఓ మధ్యవర్తి  ద్వారా తన కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్స నిమిత్తం అడ్వాన్స్ కింద పార్ధసారథి రూ.5 లక్షలు తీసుకున్నాడు. శ్రద్ధ ఆసుపత్రిలో చికిత్స జరిగిన అనంతరం మిగిలిన రూ.7 లక్షలు పార్ధసారథికి ఇవ్వలేదు. దీంతో, విశాఖలోని మహారాణిపేట పోలీసులకు పార్ధసారథి ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయటపడింది.

More Telugu News