Telangana: ‘భువనగిరి’లో రోలర్ కారణంగానే టీఆర్ఎస్ ఓడిపోయింది!: హరీశ్ రావు

  • కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం
  • అన్ని హామీలను నిలబెట్టుకుంటాం
  • సంగారెడ్డిలో మాట్లాడిన టీఆర్ఎస్ నేత

తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. రాబోయే రోజుల్లో ప్రజలకు ఇచ్చిన హామీలు అన్నింటిని నిలబెట్టుకుంటామని చెప్పారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు లోక్ సభ సభ్యుడు కొత్త ప్రభాకర్‌రెడ్డి సన్మాన సభకు హరీశ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ కార్యకర్తలు అద్భుతంగా పనిచేశారని కితాబిచ్చారు. వారందరినీ అభినందించడం కోసమే ఈ సభను ఏర్పాటు చేశామన్నారు.

కొత్త ప్రభాకర్ రెడ్డి ఇకపై వారానికి రెండ్రోజులు జిల్లాలో అందుబాటులో ఉంటారని తెలిపారు. త్వరలోనే రైతులకు రూ.5,000 పంట బీమాతో పాటు పెన్షన్లు, నిరుద్యోగ భృతిని అమలు చేస్తామని చెప్పారు. లోక్ సభ ఎన్నికల్లో భువనగిరిలో  రోలర్ గుర్తు కారణంగానే తాము ఓడిపోయామని హరీశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమయినా, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల్లో భువనగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో రోలర్ గుర్తును పొందిన ఓ స్వతంత్ర అభ్యర్థికి ఏకంగా 27,000 ఓట్లు వచ్చాయి.

More Telugu News