Andhra Pradesh: ప్రత్యేక హోదా వేరు.. పారిశ్రామిక రాయితీలు వేరు.. ప్రజలకు క్లారిటీ రావాలి!: ఐవైఆర్ కృష్ణారావు

  • ఏపీకి ఓ 4-5 వేల కోట్లు రావాలి
  • చంద్రబాబు ప్యాకేజీని తీసుకోలేదు
  • బాబు మీడియా కారణంగానే బీజేపీకి సున్నా సీటు

ఆంధ్రప్రదేశ్ కు కేంద్రం నుంచి రూ.80,000 కోట్లు రావాలని లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ చెప్పింది శుద్ధ అబద్ధమని ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి, బీజేపీ నేత ఐవైఆర్ కృష్ణారావు తెలిపారు. మొత్తం వివరాలను పరిశీలిస్తే కేంద్రం నుంచి ఏపీకి కేవలం రూ.4 వేల నుంచి రూ.5 వేల కోట్ల వరకూ మాత్రమే రావాల్సి ఉందని స్పష్టం చేశారు. ఏపీకి ప్రత్యేకహోదా కావాలని జగన్, చంద్రబాబు, రాహుల్ గాంధీ అన్నప్పుడు ఏ హోదా గురించి మాట్లాడుతున్నారో క్లారిటీ ఇవ్వాలని కోరామన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఐవైఆర్ పలు అంశాలపై ముచ్చటించారు.

‘పారిశ్రామిక రాయితీలతో కూడిన ప్రత్యేక హోదానా? లేక రాయితీలు లేని ప్రత్యేక హోదానా? అనే విషయంలో స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నాకు తెలిసి పారిశ్రామిక రాయితీలు లేని ప్రత్యేక హోదా గురించి ఎవ్వరూ మాట్లాడరు. ఈశాన్య రాష్ట్రాలకు ఇచ్చిన ప్రత్యేక హోదాలో పారిశ్రామిక రాయితీలు భాగం కాదు. ప్రత్యేక హోదా 1969 నుంచి అమల్లో ఉంటే, పారిశ్రామిక రాయితీలు 1994 నుంచి అందుబాటులోకి వచ్చాయి. ఈరోజు ప్రత్యేక హోదా అన్నది ఆ పేరుతో లేదు. ముఖ్యమంత్రి కమిటీల ద్వారా ఈశాన్య రాష్ట్రాలకు ఏం ఇస్తున్నారో అదే స్పెషల్ ప్యాకేజీ కింద మనకు ఇచ్చారు.

అయితే రాజకీయాలతో ఆయన(చంద్రబాబు) దాన్ని తీసుకోలేదు. ఈరోజు ప్రత్యేకహోదా పేరు పెట్టి ఇస్తారా? మరో పేరుతో ఇచ్చినా ఏపీకి రూ.16,400 కోట్ల వరకూ వస్తాయి. సమస్య అంతా పారిశ్రామిక రాయితీల దగ్గరే వస్తుంది. అన్ని రాష్ట్రాలను ఒప్పించాకే ఈ రాయితీలు ఇవ్వాల్సి ఉంటుంది. అది కష్టం. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు ప్రత్యేక ప్యాకేజీని తీసుకోలేదు’ అని ఐవైఆర్ స్పష్టం చేశారు. చంద్రబాబు, ఆయన మీడియా తప్పుడు ప్రచారం కారణంగానే బీజేపీ ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయిందని వ్యాఖ్యానించారు.

More Telugu News