jagan: సమర్థులైన అధికారుల కోసం జగన్‌ అన్వేషణ!

  • సమర్థులైన ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారుల కోసం ఆరా
  • తండ్రి హయాంలో పనిచేసిన వారిపైనా దృష్టి
  • స్టీఫెన్‌ రవీంద్రను డిప్యుటేషన్‌పై తేవడం ఇందులో భాగమే

రాష్ట్రపాలనలో సత్ఫలితాలు సాధించేందుకు తనతోపాటు నడిచే సమర్థులైన అధికారుల బృందం కోసం వైసీపీ అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి అన్వేషణ ప్రారంభించారు. ఫలితాల ప్రకటన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 'ఐదుకోట్ల మందిలో ఒక్కరికి ముఖ్యమంత్రిగా అయ్యే అవకాశం వస్తుంది. ప్రజలు, దేవుడు నాకు అటువంటి అవకాశాన్ని ఇచ్చారు. ఏడాదిలోగా నాదైన పాలనతో మంచి ముఖ్యమంత్రిని అనిపించుకుంటాను’ అని అన్న విషయం తెలిసిందే.

ఈ మాట నిలబెట్టుకోవాలంటే సమర్థులైన అధికారుల బృందం తప్పనిసరి అని భావిస్తున్న జగన్‌ ఇందుకోసం వెదుకుతున్నారు. ముఖ్యంగా పోలీసులు, వివిధ శాఖల అధికారుల విషయంలో జాగ్రత్త వహిస్తున్నారు. గతంలో తండ్రి వైఎస్సార్‌ హయాంలో చిత్తశుద్ధితో సేవలందించిన అధికారులతోపాటు ప్రస్తుతం ఉన్న అధికారుల్లోనూ వీరి కోసం ఆరాతీస్తున్నారు.

వైఎస్సార్‌ హయాంలో ఆయన వ్యక్తిగత భద్రతా అధికారిగా పనిచేసిన స్టీఫెన్‌ రవీంద్రను ఏరికోరి రాష్ట్రానికి డిప్యుటేషన్‌పై తెచ్చుకుని ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ బాధ్యతలు అప్పగించాలన్న యోచన కూడా ఇందులో భాగమేనని భావిస్తున్నారు. ప్రజాభిప్రాయాన్ని సేకరించి పాలనలో లోటుపాట్లు ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఇంటెలిజెన్స్‌ విభాగం కీలకం. అందుకే స్టీఫెన్‌ను ఎన్నుకున్నారన్నది పరిశీలకుల భావన. అలాగే, సీఎంఓ అధికారులు, మంత్రిత్వ శాఖ అధికారుల విషయంలోనూ జగన్‌ ఆచితూచి నియామకాలు చేపట్టే అవకాశం ఉందని భావిస్తున్నారు.

More Telugu News