Hyderabad: ఎల్‌బీ స్టేడియంను రాజకీయ కార్యక్రమాలకు ఇవ్వొద్దు : నిరసనకు దిగిన కోచ్‌లు, క్రీడాకారులు

  • సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఇబ్బందులొస్తున్నాయని ఆవేదన
  • 1967లో నగరం నడిబొడ్డున నిర్మించిన స్టేడియం
  • ప్రధాన క్రీడా మైదానంగా గుర్తింపు

అంతర్జాతీయ క్రీడా ప్రమాణాలున్న స్టేడియంలో సభలు, సమావేశాలు నిర్వహిస్తుండడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ పలువురు కోచ్‌లు, క్రీడాకారులు హైదరాబాద్‌ నగరంలోని ఎల్పీ స్టేడియం ఎదుట ఈరోజు ఉదయం ధర్నాకు దిగారు. స్టేడియంను విందు, వినోదాల కోసం వాడుకోవద్దని, కేవలం క్రీడా అవసరాలకు మాత్రమే వినియోగించాలని డిమాండ్‌ చేశారు.

నగరం నడిబొడ్డున 1967లో ఈ స్టేడియంను నిర్మించారు. దీన్ని ఫతేమైదాన్ అని పిలిచే వారు. కాలక్రమంలో అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దిన అనంతరం లాల్‌బహూదూర్‌శాస్త్రి సంస్మరణార్థం స్టేడియంకు ఆయన పేరు పెట్టారు. అప్పటి నుంచి ఎల్పీ స్టేడియంలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌కు సంబంధించి అంతర్జాతీయ పోటీలు నిర్వహిస్తున్నారు. ఎంతోమంది జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దిన ఘనత ఈ మైదానానికి ఉంది.

అయితే, ఇటీవల కాలంలో తరచూ స్టేడియంను సమావేశాలు, సభలకు ఇస్తుండడం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయని క్రీడాకారులు, కోచ్‌లు ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఆవేదనను క్రీడా సంఘం పట్టించుకోక పోవడంతో ఈరోజు నిరసనకు దిగారు. రోడ్డుపైనే బైఠాయించడంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. దీంతో సైఫాబాద్‌ పోలీసులు నిరసనలో పాల్గొన్న బేగం బజార్‌ కార్పొరేటర్‌ శంకర్‌యాదవ్‌తోపాటు పలువురు క్రీడాకారులు, కోచ్‌లను అరెస్టు చేశారు.

More Telugu News