Jagan: తిరిగి వెంకన్న సేవకు రమణ దీక్షితులు... పదవీ విరమణ నిబంధన రద్దు యోచనలో జగన్!

  • రిటైర్ మెంట్ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటా
  • మేనిఫెస్టోలో ప్రకటించిన వైఎస్ఆర్ కాంగ్రెస్
  • జగన్ ప్రమాణ స్వీకారం చేయగానే నిర్ణయాన్ని అమలు చేయాలి
  • కోరుకుంటున్న అర్చకులు, మిరాశీలు

టీటీడీ మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు తిరిగి విధుల్లో చేరనున్నారా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, ఎన్నికలకు ముందు తన మేనిఫెస్టోలో అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని రద్దు చేయటంతో పాటు సన్నిధి గొల్లలకు న్యాయం చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో, చంద్రబాబు సర్కారు విధానం కారణంగా దేవుడి సేవలకు దూరమైన అర్చకులు తిరిగి విధుల్లోకి వెళతామని ఆశలు పెంచుకుంటున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని అమలు చేయాలని అర్చకులు, సన్నిధి గొల్లలు ఎదురు చూస్తున్న పరిస్థితి వుంది.

మిరాశీ వ్యవస్థ రద్దయిన తరువాత, గత సంవత్సరం మే16న టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమై, 65 ఏళ్లకు పైబడిన అర్చకులకు పదవీ విరమణ విధానాన్ని వర్తింపజేసిన సంగతి తెలిసిందే. దీంతో అప్పటి ఆలయ ప్రధాన అర్చకుడు రమణ దీక్షితులుతో పాటు 15 మంది మిరాశీ, సంభావన అర్చకులు విధుల నుంచి తొలగించబడ్డారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన పలువురు సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. తాము అధికారంలోకి వస్తే, రిటైర్ మెంట్ విధానాన్ని రద్దు చేస్తామని, అర్చకులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని కూడా వైసీపీ తమ మేనిఫెస్టోలో పేర్కొంది.

వైఎస్ జగన్ సైతం ఈ విషయంలో సానుకూలంగానే ఉన్నట్టు పార్టీ నేతలు అంటున్నారు. సాధ్యమైనంత త్వరలో పాత సర్కారు నిర్ణయాలను జగన్ సమీక్షిస్తారని, అన్ని వర్గాలకూ న్యాయం జరిగే నిర్ణయాలు తీసుకుంటారని అంటున్నారు. దీంతో తిరుమలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన దేవాలయాలన్నింటిలోనూ ఉన్న సమస్యలను జగన్ సర్కారు పరిష్కరిస్తుందని అర్చకులు, మిరాశీలు ఆశతో వున్నారు. 

More Telugu News