Uttar Pradesh: పోలీసులకు 12 గంటల డెడ్‌లైన్.. సురేంద్రసింగ్ హత్యకేసు నిందితుల అరెస్ట్‌పై సీఎం యోగి ఆదేశాలు

  • పోలీసులకు డెడ్‌లైన్ విధించిన ముఖ్యమంత్రి
  • పోలీసుల అదుపులో ఏడుగురు నిందితులు
  • ఇప్పటికే లక్నో చేరుకున్న పోలీస్ బాస్

కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సన్నిహితుడు, బరూలియా మాజీ సర్పంచ్ సురేంద్రసింగ్‌ను హత్య చేసిన వారిని 12 గంటల్లో పట్టుకోవాలని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పోలీసులను ఆదేశించారు. ఈ కేసులో దర్యాప్తును పర్యవేక్షించేందుకు ఐజీ ఇప్పటికే లక్నో చేరుకున్నారు. స్మృతి ఇరానీకి సన్నిహితుడైన సురేంద్ర సింగ్‌పై ఆయన నివాసంలోనే గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

సురేంద్రసింగ్ హత్యపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన యోగి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, 12 గంటల్లో  వారిని అరెస్ట్ చేయాలని డీజీపీని  ఆదేశించారు.

వరండాలో నిద్రపోతున్న సురేంద్రసింగ్‌పై ఆదివారం తెల్లవారుజామున 3 గంటలకు నిందితులు కాల్పులకు తెగబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు ఏడుగురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. నిందితులకు సంబంధించి కొన్ని ఆధారాలు లభ్యమయ్యాయని, 12 గంటల్లోనే కేసును ఛేదిస్తామని పోలీసులు ధీమా వ్యక్తం చేశారు. కేసును అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. కాగా, ఈ హత్య వెనక కాంగ్రెస్ మద్దతుదారుల హస్తం ఉందని సురేంద్రసింగ్ కుమారుడు ఆరోపించారు.

More Telugu News