Tollywood: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను కాంట్రావర్శీ చేసింది చంద్రబాబునాయుడే: రామ్ గోపాల్ వర్మ

  • ఈ చిత్రంలో నిజం చెప్పేందుకు ప్రయత్నించా
  • అది కొంతమందికి నచ్చలేదు..అడ్డంకులు సృష్టించారు
  • ఈ నెల 31న విడుదల చేస్తాం

విజయవాడలోని పాయకాపురం, పైపులరోడ్డు జంక్షన్ లోప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల ప్రెస్ మీట్ పెట్టేందుకు వెళ్లగా అక్కడి పోలీసులు అడ్డుకుని వెనక్కి పంపిన విషయం తెలిసిందే. అదే ప్లేస్ లో ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ పెడతానని వర్మ కొన్ని రోజులుగా చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. అయితే, పైపుల రోడ్డు జంక్షన్ కు బదులు వేరే చోట ఆయన ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ, పైపులరోడ్డులో ఇటీవల తన ప్రెస్ మీట్ నిర్వహించకుండా బలవంతంగా వెనక్కి తిప్పి పంపారని అన్నారు. ఒక కీలక వ్యక్తి ఫోన్ కాల్ తో తనను బలవంతంగా వెనక్కి పంపించేశారని, ఆ వ్యక్తి ఎవరనేది త్వరలో బయటకు వస్తుందని అన్నారు. ఈరోజున అక్కడ ప్రెస్ మీట్ నిర్వహించ వద్దని తనను రిక్వెస్ట్ చేశారని, అందుకే, నిర్ణయం మార్చుకున్నట్టు చెప్పారు. అదీకాక, ఎండ మండిపోతోందని, చెమటలు కూడా బాగా పోస్తున్నాయని వర్మ చెప్పడం గమనార్హం.

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను తప్పని పరిస్థితుల్లో చేయాల్సి వచ్చిందని అన్నారు. ఈ చిత్రంలో నిజం చెప్పేందుకు ప్రయత్నించానని, అది కొంతమందికి నచ్చలేదని, అందుకే, ఈ సినిమా విడుదల కాకుండా అడ్డంకులు సృష్టించారని అన్నారు. ఈ నెల 31న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను విడుదల చేస్తామని, ఈ చిత్రం రాజకీయ అంశంతో కూడుకున్నది కాదని స్పష్టం చేశారు. ఈ సినిమా గురించి చంద్రబాబు ఏదో ఊహించుకుని వారే వివాదం చేసుకున్నారని,  కాంట్రావర్శీ చేసింది చంద్రబాబేనని ఆరోపించారు. ఏపీలో టీడీపీ ఓటమిపై వర్మ ప్రస్తావిస్తూ, ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడం వల్లే ఆయన ఓటమిపాలయ్యారని అన్నారు. సైకిల్ చక్రం తిరిగి తిరిగి పంచర్ అయిందని వ్యాఖ్యానించారు. 

More Telugu News