Andhra Pradesh: భీమవరంలో ఓట్ల గోల్ మాల్ జరిగిందని వార్తలు.. క్లారిటీ ఇచ్చిన జనసేన!

  • పోలైన, లెక్కించిన ఓట్ల మధ్య తేడా
  • సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన వార్తలు
  • ఖండించిన జనసేన పార్టీ

జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసిన సంగతి తెలిసిందే. భీమవరంలో వైసీపీ నేత గ్రంథి శ్రీనివాస్, గాజువాకలో మరో వైసీపీ నేత తిప్పల నాగిరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. ఈ నేపథ్యంలో భీమవరంలో తొలుత పవన్ కు మెజారిటీ వచ్చిందనీ, అయితే ఆ తరువాత గోల్ మాల్ చోటుచేసుకుందని వార్తలు వచ్చాయి.

భీమవరంలో ఈవీఎంలో పోలైన ఓట్లకు, లెక్కించిన ఓట్లకు మధ్య తేడా ఉన్నట్లు వార్తలు రావడంతో జనసేన శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. దీంతో ఈ వ్యవహారంపై పార్టీ స్పందించింది. భీమవరంలో ఓట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినట్లు వస్తున్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని జనసేన పార్టీ తెలిపింది. పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేల్చిచెప్పింది.

జనసేన తరఫున భీమవరంలో కౌంటింగ్ హాల్ లోకి వెళ్లిన ఏజెంట్లు పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లు సమానంగా ఉన్నట్లు ధ్రువీకరించుకున్నారని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో జనసైనికులు ఎవరూ ఆందోళనలు, ధర్నాలు చేపట్టవద్దని జనసేన ఆదేశించింది.

More Telugu News