Sumalatha: లోక్‌సభ ఎన్నికల్లో దుమ్మురేపిన తెలుగు నటులు

  • రాజకీయాల్లోనూ సత్తా చాటుతున్న నటులు
  • సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించిన సుమలత, రవికిషన్, నవ్‌నీత్ కౌర్
  • తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్న వైనం

ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో తెలుగు చిత్రసీమతో సంబంధం ఉన్న నటులు సత్తా చాటారు. వివిధ రాష్ట్రాల నుంచి పోటీచేసిన వీరంతా తొలిసారి పార్లమెంటులో అడుగుపెట్టబోతున్నారు. వీరిలో సీనియర్ నటి సుమలత, అల్లు అర్జున్ నటించిన రేసుగుర్రం సినిమాలోని విలన్ పాత్రధారి రవికిషన్, యమదొంగ, శ్రీను వాసంతి లక్ష్మీ, మహారథి వంటి సినిమాల్లో నటించిన నవనీత్ కౌర్ ఉన్నారు.
 
భోజ్‌పురి, బాలీవుడ్ సినిమాలతో పలు తెలుగు సినిమాల్లో నటించిన రవికిషన్.. రేసుగుర్రం సినిమాలో విలన్‌గా మెప్పించారు. దేశవ్యాప్తంగా ఆయనకు మంచి పాప్యులారిటీ ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన ఆయన పరాజయం పాలవగా, ఈసారి బీజేపీ టికెట్‌పై గోరఖ్‌పూర్ నుంచి బరిలోకి దిగారు. ఏకంగా మూడు లక్షల పైచిలుకు మెజారిటీతో ఘన విజయం సాధించారు.
 
కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో కర్ణాటకలోని మాండ్య నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచిన సుమలత ఒకప్పటి టాప్ హీరోయిన్లలో ఒకరు. చిరంజీవి సరసన పలు సినిమాల్లో నటించిన ఆమె ఖైదీ వంటి బ్లాక్‌బస్టర్ సినిమాల్లో  నటించారు. తెలుగుతోపాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాల్లోనూ నటించి అక్కడ కూడా అగ్ర హీరోయిన్లలో ఒకరిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కన్నడ నటుడు అంబరీశ్‌ను వివాహం చేసుకున్న సుమలత ఆయన చనిపోవడంతో రాజకీయాల్లోకి వచ్చారు. ఇటీవలి ఎన్నికల్లో మాండ్య నుంచి పోటీ చేసిన ఆమె ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్‌పై ఘన విజయం సాధించారు.
 
ఎన్టీఆర్ నటించిన యమదొంగ సినిమాలో ఓ పాటలో నర్తించిన నవనీత్ కౌర్ ఆ తర్వాత మరిన్ని సినిమాల్లోనూ నటించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలోని అమరావతి లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేశారు. యువ స్వాభిమానీ పక్ష తరపున శివసేన సిట్టింగ్ ఎంపీ ఆనంద్‌రావ్‌పై  30 వేల మెజారిటీతో విజయం సాధించారు. ఆమె భర్త రవి రాణా ఎమ్మెల్యే కాగా, ఇప్పుడామె ఎంపీగా పార్లమెంటులో అడుగుపెడుతున్నారు.

More Telugu News