Vijayawada: పోలీసుల అధీనంలో విజయవాడ మునిసిపల్ స్టేడియం... వాకర్లను అనుమతించక పోవడంతో విమర్శలు!

  • 30న జగన్ ప్రమాణ స్వీకారం
  • ఏర్పాట్లు చేస్తున్న అధికారులు
  • వేదికగా ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం
  • ఐదు రకాల పాస్ లు జారీ

విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియం పోలీసుల అధీనంలోకి వెళ్లిపోవడంతో ఈ ఉదయం వాకింగ్ కు వచ్చిన ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఈ నెలాఖరున జగన్ ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసేందుకు మునిసిపల్ స్టేడియంను వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియంను నిన్న పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు, ప్రభుత్వ అధికారులు, నేటి నుంచి వాకర్స్ కు అనుమతిని నిలిపివేశారు. రోజూ వచ్చేలానే ఈ ఉదయం స్టేడియానికి వచ్చిన యువత, వాకర్స్ ను లోనికి అనుమతించలేదు. తిరిగి 31న మాత్రమే అనుమతి ఉంటుందని అధికారులు చెప్పడంతో, ఆ విషయాన్ని ముందుగా ఎందుకు తెలియజేయలేదని అధికారులతో వాకర్స్ వాగ్వాదానికి దిగారు.

కాగా, స్టేడియం మొత్తాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు, డాగ్ స్క్వాడ్, బాంబు తనిఖీ బృందాలతో జల్లెడ పడుతున్నారు. జగన్ ప్రమాణ స్వీకారానికి కనీసం 30 వేల మంది వరకూ అనుమతించవచ్చని భావిస్తున్న అధికారులు, అంతకుమించి వస్తే మాత్రం తామేమీ చేయలేమని, స్టేడియం కెపాసిటీ సహకరించదని స్పష్టం చేస్తున్నారు. ఈ ఐదు రోజులూ స్టేడియంలోకి అనుమతి ఉన్న వారిని తప్ప మిగతా వారిని రానిచ్చే పరిస్థితి లేదని వెల్లడించారు.

జగన్ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, వీవీఐపీలు, వీఐపీల పార్కింగ్, సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు చురుకుగా సాగుతున్నాయని అధికారులు తెలిపారు. ఏర్పాట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్, విజయవాడ సీపీ, మునిసిపిల్ కమిషనర్ లు, హైదరాబాద్, విశాఖ, చెన్నై తదితర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను శివార్లలోనే నిలిపివేసుకోవాల్సి వుంటుందని, అందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్పష్టం చేశారు.

పార్కింగ్ కోసం 5 రకాల ఎంట్రీ పాస్ లు జారీ చేయనున్నామని వెల్లడించిన సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం, పార్కింగ్ కోసం ఏఆర్ గ్రౌండ్స్, బిషప్ అజరయ్య స్కూల్, పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ ను ఎంపిక చేశామన్నారు. స్టేడియంలోకి 25 వేల మందిని మాత్రమే అనుమతిస్తామని, ఎండల దృష్ట్యా గ్యాలరీలు, మైదానంలో ఏసీలు, కూలర్ల ఏర్పాటుతో పాటు తాగునీటిని కూడా అందించే ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. స్టేడియంలోకి రాలేకపోయిన వారి కోసం బయట భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేస్తామన్నారు.

More Telugu News