Etela Rajender: ఐకమత్యంతో పోరాడినపుడే లక్ష్యాలు సాధించుకోవచ్చు: ఈటల

  • ప్రశ్నించే గొంతు ఉండకూడదనేది మంచి పద్ధతి కాదు
  • ప్రశ్నించేవారున్నప్పుడే సమాజం చైతన్యవంతమవుతుంది
  • జ్యోతిరావు పూలే అవార్డుల కార్యక్రమంలో మంత్రి 

సమాజంలో ప్రశ్నించే గొంతు ఉండకూడదనేది మంచి పద్ధతి కాదని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. నేడు ఆయన హైదరాబాద్ రవీంద్రభారతిలో మహాత్మా జ్యోతిరావుపూలే పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో పాల్గొని వివిధ రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ, ఐకమత్యంతో పోరాడినప్పుడే మనం అనుకున్న లక్ష్యాలను సాధించుకోవచ్చన్నారు.

సమాజంలో ప్రశ్నించేవారున్నప్పుడే సమాజం చైతన్యవంతమవుతుందన్నారు. ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ, సినీ నటుడు, నిర్మాత, దర్శకుడు ఆర్‌ నారాయణమూర్తి, ఈనాడు పత్రిక ప్రతినిధి మల్లేశం తదితరులు అవార్డులు అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజూల శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

More Telugu News