Jagan: జగన్ ఓ కూలీని ఎంపీని చేశారు... అది వినగానే కన్నీళ్లు ఆగలేదు: ఎంపీ గోరంట్ల మాధవ్

  • నందిగం సురేశ్ గురించి ప్రస్తావించిన హిందూపురం ఎంపీ
  • ప్రత్యేక హోదా కోసం కృషిచేస్తామంటూ ప్రతిన
  • సెల్యూట్ వివాదంపై స్పందన

అనంతపురం జిల్లాలో సీఐగా పనిచేసిన గోరంట్ల మాధవ్ ఇవాళ వైసీపీ ఎంపీ. లోక్ సభ ఎన్నికల్లో ఆయన హిందూపురం ఎంపీ స్థానం నుంచి ఘనవిజయం సాధించారు. ఎన్నికల ఫలితాల అనంతరం ఎంతో ఉత్సాహంగా ఉన్న గోరంట్ల మాధవ్ మీడియాతో మాట్లాడుతూ, బాపట్ల యువ ఎంపీ నందిగం సురేశ్ అంశాన్ని ప్రస్తావించారు.

"సార్ నేనిక్కడే కూలి పనులకు వెళ్లాను. అదే ప్రాంతంలో నన్ను ఎంపీని చేశారు సార్ మీరు అంటూ నందిగం సురేశ్ కన్నీటితో జగన్ కు థ్యాంక్స్ చెబుతుంటే నాకు కూడా కన్నీళ్లు ఆగలేదు. నేను పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంటుకు వెళుతున్నాను. వ్యక్తిగతంగా నాకూ ఎంతో ఆనందంగా ఉంది. వైసీపీ ఎంపీల అజెండా ఒక్కటే. ప్రత్యేక హోదా సాధన కోసమే కృషిచేస్తాం" అంటూ స్పష్టం చేశారు.

ఇక, ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే, తనకు కొందరు పోలీసు ఉన్నతాధికారులు సెల్యూట్ చేసినట్టు వస్తున్న వార్తలను గోరంట్ల మాధవ్ ఖండించారు. తానే పోలీసు అధికారులను చూసి గౌరవంగా సెల్యూట్ చేశానని, తనకు అధికారులు సెల్యూట్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజంలేదని స్పష్టం చేశారు. మొదట సెల్యూట్ చేసింది తానేనని క్లారిటీ ఇచ్చారు.

More Telugu News