Karnataka: ఓడిపోయానని బాధపడడం లేదు...కారణాలు చెప్పాలనుకోవడం లేదు: దేవగౌడ

  • ఇది నాకు రెండో ఓటమి
  • మాజీ ప్రధాని అయినంత మాత్రాన ఓడిపోకూడదా?
  • జేడీఎస్‌ను బలోపేతం చేయడం ప్రస్తుతం నాముందున్న లక్ష్యం

సార్వత్రిక ఎన్నికల్లో పరాజయం పాలైన మాజీ ప్రధాని, జేడీఎస్‌ అధినేత దేవగౌడ తన ఓటమిపై నిర్వేదంగా మాట్లాడారు. ‘ఇది తొలి ఓటమి కాదు. రెండు సార్లు ఓడిపోయాను. మాజీ ప్రధానిని అయినంత మాత్రాన ఓడిపోకూడదని లేదు. ఇందుకు కారణాలు కూడా మీతో పంచుకోలేను. ఎవరినీ నిందించను. ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేయడమే నా ముందున్న ప్రధాన లక్ష్యం’ అని చెప్పుకొచ్చారు.

దేశంలో ప్రాంతీయ పార్టీల ఉనికిని రక్షించాల్సిన అవసరం ఉందని, దీన్ని తమ పార్టీ బలోపేతంతో మొదలు పెడతానని చెప్పారు. కాంగ్రెస్‌, జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం గురించి మాట్లాడుతూ ఇరుపార్టీలు సమన్వయంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వంపై అనుమానాలు మొదలయ్యాయి. దీంతో ఇరు పార్టీల నేతలు సమావేశమై భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. కూటమి సమన్వయ కమిటీ కన్వీనర్‌ సిద్ధరామయ్యను సీఎం కుమారస్వామి కలిసి చర్చించారు. ఆ తర్వాత ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడుతూ తమ ప్రభుత్వానికి ఢోకాలేదని తెలియజేశారు.

More Telugu News