ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమయ్యా.. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటా: లగడపాటి రాజగోపాల్

24-05-2019 Fri 18:00
  • ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో నా సర్వేలు లెక్క తప్పాయి
  • నా సర్వేలతో ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలి
  • ప్రతిపక్షనేతగా బాబు నిర్మాణాత్మక పాత్ర పోషించాలి

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై లగడపాటి సర్వే విఫలమైన విషయం తెలిసిందే. తాజాగా, ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించిన ఆయన సర్వే అంచనాలు వాస్తవ ఫలితాలను ఏమాత్రం చేరుకోలేకపోయాయి. ఏపీలో టీడీపీనే మళ్లీ అధికారంలోకి వస్తుందని చెప్పిన లగడపాటి అంచనాకు పూర్తి భిన్నంగా జరిగింది.

ఈ నేపథ్యంలో లగడపాటిపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏపీ, తెలంగాణ ఎన్నికల్లో తన సర్వేలు లెక్క తప్పాయని, ప్రజల నాడి తెలుసుకోవడంలో విఫలమైనందుకు చింతిస్తున్నానని అన్నారు. భవిష్యత్తులో సర్వేలకు దూరంగా ఉంటానని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సర్వేల వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే మన్నించాలన్న లగడపాటి, 2004 నుంచి అనేక రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ వచ్చానని, ఎటువంటి పక్షపాతం లేకుండా అనేక సందర్భాల్లో ప్రజల నాడి తెలిపానని గుర్తుచేశారు. ప్రతిపక్షనేతగా చంద్రబాబు నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కోరారు.