Visakhapatnam MP: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణకు మూడో స్థానం... చెప్పుకున్నంతగా కనిపించని చరిష్మా

  • ఒక దశలో ప్రధాన పార్టీలకు ముచ్చెమటలు పట్టించిన వీవీ
  • విశాఖ ఎంపీ స్థానంలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని ప్రచారం
  • ఆయన గెలిచేస్తున్నారంటూ ఊహాగానాలు

పార్టీ ఇమేజ్‌ కంటే వ్యక్తిగత ఇమేజ్‌తో విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గంలో దూసుకు వెళ్లిన జనసేన అభ్యర్థి, సీబీఐ మాజీ అధికారి వి.వి.లక్ష్మీనారాయణ ఎన్నిక వేళ ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసీపీ అభ్యర్థులను బెంబేలెత్తించినా చివరికి ఆయన మూడో స్థానానికే పరిమితమయ్యారు. నియోజకవర్గంలో భారీగా క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని, ఎంపీ అభ్యర్థికి వచ్చేసరికి పార్టీలకు అతీతంగా అన్నివర్గాలు లక్ష్మీనారాయణకు ఓటేశాయన్న ప్రచారం జరగడంతో ఆయన గెలుపు దాదాపు ఖాయమన్న అంచనాకు అందరూ వచ్చారు.

రాజకీయ పార్టీలు కూడా అంతర్గత చర్చల్లో దాదాపు ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి.  నిజాయతీపరుడైన పోలీసు అధికారిగా పేరుండడం, ప్రచారం సందర్భంగా ఆయన నిరాడంబరత్వం విశాఖ ఓటర్లను ఆకట్టుకున్నాయి. ఉదయం వాకర్స్‌ను కలవడంతో మొదలుపెట్టి తనదైన శైలిలో సభలు, సమావేశాలు నిర్వహించుకుంటూ ఆయన నియోజకవర్గంలో కలియదిరిగారు. తన ప్రసంగాల్లో ఎక్కడా వ్యక్తిగత విమర్శలకు దిగకుండా హుందాగా వ్యవహరిస్తూ ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. తటస్థ ఓటర్లను ఇది బాగా ఆకట్టుకుంది.

దీంతో ఆయన వైపు గాలి ఉండవచ్చునన్న అంచనాకు అంతా వచ్చారు. కానీ అనూహ్యంగా ఆయన మూడో స్థానానికే పరిమితం కావడం, ఓట్ల లెక్కింపు సందర్భంగా అన్ని రౌండ్లలోనూ టీడీపీ, వైసీపీ అభ్యర్థుల మధ్యే హోరాహోరీ పోరు నడవడం ఆశ్చర్యపరిచింది. ఇందుకు ముఖ్య కారణం నగర ఓటర్లలో ఒక వర్గం లక్ష్మీనారాయణను బాగానే ఆదరించినప్పటికీ, గ్రామీణ ప్రాంత ఓటర్లు, మురికివాడల్లోని ఓటర్లు టీడీపీ, వైసీపీ పట్ల మొగ్గు చూపడం ఆయనకు మైనస్‌ అయ్యింది.

విశాఖ నగరంలో దాదాపు 700 వరకు మురికివాడలు ఉన్నాయి. భీమిలి, ఎస్‌.కోట అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో భారీగా గ్రామీణ ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ వీవీకి మైనస్‌ అయ్యిందని ఓట్ల సరళి తెలియజేస్తోంది. పైగా గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీకి సరైన నాయకత్వ వ్యవస్థ లేకపోవడం కూడా పార్టీని దెబ్బతీసింది. అయినప్పటికీ లక్ష్మీనారాయణ దాదాపు 3 లక్షల వరకు ఓట్లు సాధించడం గమనార్హం.

More Telugu News