Kerala: ఏడేళ్ల బాలుడికి ముక్కు సర్జరీ బదులు హెర్నియా ఆపరేషన్ చేసిన ప్రభుత్వ వైద్యుడు!

  • ఫైళ్లు తారుమారు కావడంతో ఘటన
  • వైద్యుడిపై వేటేసిన ఉన్నతాధికారులు
  • కేరళలోని మంజేరి మెడికల్ కాలేజీలో ఘటన

ముక్కుకు సర్జరీ కోసం ఆసుపత్రిలో చేరిన ఏడేళ్ల బాలుడికి ఓ వైద్యుడు హెర్నియా ఆపరేషన్ చేశాడు. కేరళలో జరిగిన ఈ ఘటన వైద్యుడి నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. విషయం వెలుగులోకి రావడంతో ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిని సస్పెండ్ చేశారు. అయితే, వైద్యుడు మాత్రం తనను తాను సమర్థించుకుంటున్నాడు. బాలుడికి హెర్నియా కూడా ఉందని వాదిస్తున్నాడు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అధికారులు పేషెంట్ ఫైళ్లు కలిసి పోవడం వల్లే ఇలా జరిగిందని తేల్చారు. బాలుడిలాంటి పేరే కలిగిన మరో వ్యక్తికి చేయాల్సిన ఆపరేషన్‌ను ముక్కుకి సర్జరీ కోసం వచ్చిన బాలుడికి చేసినట్టు తేల్చారు.  

ముక్కులో అకస్మాత్తుగా వాపు వస్తుండడంతో ఈ ఏడాది జనవరి 7న ఏడేళ్ల హసన్‌ను అతడి తల్లిదండ్రులు కేరళలోని మంజేరి మెడికల్ కాలేజీలో చేర్చారు. మే 21న వైద్యులు ఆపరేషన్ చేశారు. అయితే, ముక్కుకు బదులు కడుపు వద్ద కట్టు ఉండడంతో ఆశ్చర్యపోయిన బాలుడి తల్లిదండ్రులకు వైద్యులు షాకింగ్ న్యూస్ చెప్పారు.  

ముక్కుకు బదులు హెర్నియాకు ఎలా ఆపరేషన్ చేస్తారని వైద్యులను ప్రశ్నిస్తే, అతడికి హెర్నియా కూడా ఉందంటూ తిరిగి గద్దించారు. అయితే, విషయం బయట పడకుండా ఉండేందుకు బాలుడికి మరోమారు శస్త్రచికిత్స నిర్వహించారు. అయినప్పటికీ విషయం బయటకు రావడంతో ఉన్నతాధికారులు విచారణ జరిపి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యుడిపై తాజాగా వేటేశారు.

More Telugu News